కర్నూలు జిల్లా, రుద్రవరం మండలం ఆలమూరులోని కల్లు దుకాణంలో శుక్రవారం పేలుడు సంభవించి ముగ్గురికి గాయాలయ్యాయి. ఇది పొలాల్లో జంతువుల కోసం పెట్టే పేలుడు పదార్థామా లేక నాటు బాంబా అన్నది తెలియడం లేదు. పేలుడుతో కల్లు దుకాణ యజమాని పడకండ్ల పెద్ద పుల్లయ్య, పెట్నికోట ఉసేన్‌బాషా, బోగిని ఎల్లయ్య తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఏదేమైనా కల్లు దుకాణంలో పేలుడు పదార్థం ఎందుకు నిల్వ ఉంచారు.. ఎవరు ఉంచారనే దానిపై స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న శిరివెళ్ల సీఐ చంద్రబాబునాయుడు, ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని కల్లు దుకాణం పరిశీలించారు. కల్లు దుకాణం యజమానిని విచారించారు. గాయపడిన వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స చేసి 108 వాహనంలో ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు వైద్యాధికారి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. గాయపడిన వారి కాళ్లలో చిన్న పాటి గాజు రవ్వలు గుర్తించామని అన్నారు. ఆలమూరు వీఆర్వో జబేరియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.