తన పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని.. నిజం, న్యాయం కోసం పోరాడే గొంతు ఆగదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ప్రజల కోసం పోరాడేందకు బయలుదేరితే 20 కేసులు పెట్టారని.. జగన్ కు ఆఫర్ ఇస్తున్నా.. 400 కేసులు పెట్టుకో అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, షర్మిళ పాదయాత్ర చేసినప్పుడు వారి మైకు చంద్రబాబు లాక్కున్నారా అని ప్రశ్నించారు. తనపై పెట్టే దృష్టి పోలీసుల ఇబ్బందులుపై దృష్టి పెట్టాలన్నారు. వారికి 3 సరెండర్ లీవ్స్ పెండింగులో ఉన్నాయని.. ఒక్కో కానిస్టేబుల్ కు రూ.75 వేలు రావాలన్నారు. ఎస్.ఐలకు 90 వేల రావాలి.. సీఐలకు లక్ష రావాలని లెక్క చెప్పారు.
టీఏ, డీఏలు, మెడికల్ బిల్లులు 8 నెలలుగా పెండింగులో ఉన్నాయని.. తమ సమస్యలపై పోరాడండని పోలీసులు చెప్తున్నారన్నారు. ఏటా ఇస్తానన్న జాబ్ కేలండర్, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ హామీ గోవిందయ్యాయన్నారు లోకేష్. ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులు డీఎస్సీ ద్వారా భర్తీ అన్నారని.. అవి కూడా గోవింద అన్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తాయన్నారని.. 25 మంది ఎంపీలివ్వండి మెడలు వంచి హోదా తెస్తానన్న మాట ఏమైందని ప్రశ్నించారు. రాజ్యసభ ఎంపీలతో కలిపి 31 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని.. ఏనాడైనా పార్లమెంట్ లో ప్రత్యేక హోదాపై మాట్లాడారా అన్నారు. ప్రత్యేక హోదా పేరుతో యువతను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు.
అమ్మఒడి ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తానని.. ఇప్పుడు ఒకరికే ఇస్తున్నారని విమర్శించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారా.. రూ.3వేల పింఛన్ పెంచారా అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని.. మోటార్లకు మీటర్లు పెడతాం అంటున్నారన్నారు. ఉద్యోగులకు చంద్రబాబు ఉన్నప్పుడు పండగలా ఉంది.. 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారన్నారు. కానీ జగన్ వచ్చి ఉన్న ఫిట్మెంట్ పీకేశారని.. నెలనెలా జీతం పడటంలేదని.. జీతం కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చిందన్నారు. జగన్ సీఎం అయ్యాక.. అన్నా క్యాంటీన్, చంద్రన్నబీమా, చంద్రన్న కానుకలు లేకుండా చేశారని మండిపడ్డారు.
నగరి నియోజకవర్గంలో మంత్రి రోజా డైరెక్షన్ లో గ్రావెల్ తవ్వి పక్క రాష్ట్రానికి పంపిస్తున్నారని ఆరోపించారు. నగరి నియోజవర్గంలోని ఐదు మండలాలను విభజించి సొంత కుటుంబ సభ్యులకు అప్పగించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వడమాలపేట, నిండ్ర, పుత్తూరును అన్న రాంప్రసాద్ రెడ్డికి, విజయపురం మండలాన్ని కుమారస్వామిరెడ్డికి, నగరి మండలాన్ని భర్త సెల్వమణి తమ్ముడికి పంచేశారని విమర్శించారు. రోజా భర్తతో కలసి నగరికి ఐదురుగురు షాడో ఎమ్మెల్యేలు ఉన్నారని.. ల్యాండ్ కబ్జాలు జబర్దస్త్ గా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు ఒంటరివాళ్లు అయ్యారు.. జగన్ సీఎం అయ్యాక ప్రజలు పేదవాళ్లు అయ్యారన్నారు. అందరూ కలసి వచ్చి టీడీపీని గెలిపించుకోవాలన్నారు. నగరిలో అభివృద్ధి చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుందన్నారు.