ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిలిప్పీన్స్‌ కోస్ట్ గార్డ్ నౌక సిబ్బందిపై దాడికి తెగబడ్డ డ్రాగన్

international |  Suryaa Desk  | Published : Wed, Feb 15, 2023, 11:29 AM

తన  సరిహద్దు  దేశాలపై చైనా దురాగాతాలు  అంతా ఇంతాకాదు.  తాాజాగా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. తాజాగా, ఫిలిప్పీన్స్‌ కోస్ట్ గార్డ్ నౌక సిబ్బందిపై దాడికి తెగబడింది. తమ సిబ్బందిపై చైనా కోస్ట్‌గార్డ్ నౌక రెండుసార్లు లేజర్‌ను ప్రయోగించినట్టు ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీనివల్ల తమ సిబ్బంది తాత్కాలికంగా కంటి చూపును కోల్పోయారని, ఇది తమ సార్వభౌమ హక్కులపై దాడి అని ఆగ్రహం వ్యక్తం చేసింది. దక్షిణ చైనా సముద్రంలోని సెకండ్‌ థామస్‌ షోల్‌ అనే ప్రాంతం వద్ద 1999 నుంచి నిలిపి ఉంచిన ఫిలిప్పీన్స్ నౌకలోని సిబ్బందికి ఫిబ్రవరి 6న ఆహారం తీసుకువెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.


వివాదాస్పద స్పార్ట్లే దీవుల వద్ద ఆ నౌకకు డ్రాగన్ కోస్ట్‌గార్డ్ నౌక ప్రమాదకరంగా కేవలం 449 అడుగుల సమీపానికి వెళ్లింది. ‘‘సాయంత్రం 6 గంటల సమయంలో ఓడ 10 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న షోల్‌ను సమీపిస్తుండగా చైనా కోస్ట్ గార్డ్ (CCG) నౌక 5205.. బీఆర్పీ మలపాస్కువాపై రెండుసార్లు లేజర్లు లైట్ వెలిగించి, విధుల్లో ఉన్న సిబ్బందిని తాత్కాలికంగా అంధుల్ని చేసింది’’ అని ఫిలిప్పీన్స్ పేర్కొంది. జాతీయతతో సంబంధం లేకుండా ఈ ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది.


చైనా దూకుడు చర్యలపై ఫిలిప్పీన్స్‌ ఒక్క 2022లోనే 200 సార్లు దౌత్యమార్గంలో నిరసన తెలిపింది. దక్షిణ చైనా జలాల్లో గతంలో కూడా ఫిలిప్పీన్స్‌ నౌకలను చైనా అడ్డగించినా, లేజర్లను ప్రయోగించడం మాత్రం ఇదే మొదటిసారి. దక్షిణ చైనా సముద్రంలో భారీ చమురు, గ్యాస్‌ నిక్షేపాలు ఉండటంతో చైనా కన్ను వాటిపై పడింది. అంతేకాదు, ఈ ప్రాంతం అంతర్జాతీయ రవాణా నౌకల సంచారంతో రద్దీగా ఉంటుంది. ఫిలిప్పీన్స్‌, వియత్నాం, మలేసియా, తైవాన్‌, బ్రునైలకు హక్కులు ఉన్నా, సముద్రమంతా తనదేనని చైనా వాదిస్తోంది.


వివాదాస్పద భూభాగాల్లో చైనా బెదిరింపులు, వేధింపులకు గురిచేస్తున్నట్లు ఫిలిప్పీన్స్ తరుచూ ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. గత నెల అయుంగిన్ షోల్ సమీపంలో చైనా కోస్ట్‌గార్డులు స్థానిక మత్స్యకారులను వేధించిందని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తెలిపింది. అంతర్జాతీయ నౌకలు, విమానాలు స్వేచ్ఛగా సంచరించడానికి వీలుగా ఇక్కడ అమెరికా గస్తీ కాస్తోంది. దీనిపై చైనా మండిపడుతోంది. ఫిలిప్పీన్స్‌లోని అదనపు సైనిక స్థావరాలలో అమెరికా యుద్ధ నౌకలను మోహరించినట్టు చైనా ఆరోపణలు చేసిన కొద్ది రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిని రెచ్చగొట్టే చర్యగా చైనా విమర్శించింది. అమెరికా ఆధిపత్య పోరులో ఫిలిప్పీన్స్ పావుగా మారుతుందని హెచ్చరించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com