పోోర్చుగల్ చర్చలోని దురాగతాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. పోర్చుగీస్‌లోని అతిపెద్ద క్యాథలిక్ చర్చిలో చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను స్వతంత్ర కమిటీ బయటపెట్టింది. 1950 నుంచి దాదాపు 5,000 మంది చిన్నారులపై మత పెద్దలు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తేలింది. లైంగిక వేధింపుల వ్యవహారంపై దర్యాప్తునకు నలుగురు మానసిక వైద్యులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఓ సామాజిక కార్యకర్త నేతృత్వంలో స్వతంత్ర కమిటీని పోర్చుగీసు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముందు 512 మంది బాధితులు ఇప్పటివరకు తమకు జరిగిన అన్యాయంపై నోరువిప్పారు.
నిందితుల్లో 77 శాతం మంది చర్చి మతపెద్దలు ఉన్నట్టు తేలింది. 4 శాతం మంది బాధితులు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. 77శాతం మంది ఈ మౌనంగా ఉండిపోయారు. లైంగిక వేధింపులకు గురైన బాధితుల్లో ఎక్కువశాతం మంది అబ్బాయిలే ఉండటం గమనార్హం. అమ్మాయిలు 47 శాతం మంది ఉన్నారు. వాస్తవానికి లైంగిక వేధింపుల ఆరోపణలు అంశంపై తెరపైకి వచ్చినప్పుడు బాధితుల సంఖ్య తక్కువగా ఉంటుందని భావించారు. కానీ, స్వతంత్ర కమిటీ దర్యాప్తు తర్వాత విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బాధితులు, నిందితుల పేర్లను మాత్రం కమిటీ వెల్లడించలేదు.
చర్చి లోపల చిన్నారులపై లైంగిక వేధింపుల గురించి పలు నివేదికలు వెలువడగా.. పోప్ ఫ్రాన్సిస్ దీనిని పరిష్కరించడంలో ఒత్తిడికి గురయ్యారు. గతేడాది కమిటీ విచారణలో 500 మంది బాధితులు బయటపడ్డారు. తవ్వేకొద్ది చర్చిలో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కమిటీ చీఫ్ పెడ్రో స్ట్రెచ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ సాక్ష్యాల ద్వారా కనీసం 4,815 మంది బాధితులు ఉన్నట్టు గుర్తించాం.. పిల్లల లైంగిక వేధింపుల ఉనికిని లేదా అది కలిగించిన గాయాన్ని విస్మరించడం పోర్చుగల్‌కు ఇప్పుడు కష్టం’’ అన్నారు.
నివేదికపై పోర్చుగీస్ ఎపిస్కోపల్ కాన్ఫరెన్స్ సభ్యుడు బిషప్ జోస్ ఓర్నెలాస్ మాట్లాడుతూ.. ‘‘క్లిష్టమైన, నాటకీయమైన పనితో నేను సంతృప్తి చెందాను.. ఇది కొత్త ప్రారంభాన్ని సూచిస్తుందని మేం ఆశిస్తున్నాం’’ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చర్చి మత పెద్దల లైంగిక వేధింపుల ఆరోపణలపై పోప్ ఫ్రాన్సిస్ స్పందిస్తూ 2019లో క్యాథలిక్ చర్చిలో ఇటువంటి చర్యలను నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. పోర్చుగల్‌తో పాటు ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్స్‌తో సహా పలు దేశాల్లో దీనిపై విచారణలు ప్రారంభించారు.