సీఎం జగన్ ఓ సైకో అని.. ఆయన్ను ఇంటికి పంపేందుకు వీర నారీమణుల్లా మహిళలు పోరాడాలని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల ఇళ్లపై ‘నువ్వే మా నమ్మకం’ అని కొత్తగా స్టిక్కర్‌లు వేస్తాడట.. నువ్వే మా నమ్మకం కాదు.. నువ్వే మా దరిద్రం అని ప్రజలు అంటున్నారు’’ అని చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ప్రజల కష్టాలకు ప్రధాన కారకుడైన సీఎం జగనే.. ఇప్పుడు ‘మీ నమ్మకం’ అంటూ స్టిక్కర్ వేస్తాడట అని ఎద్దేవా చేశారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలపై 45 రకాల పన్నులు వేసిన చెత్త సైకో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని మండిపడ్డారు. నాలుగేళ్ల పాలనలో తన బిడ్డకు ఉద్యోగం వచ్చిందని ఏ తల్లి అయినా చెప్పగలదా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి ఇచ్చే 10 రూపాయిలు మాత్రమే కనిపిస్తోంది కానీ.. దోచుకునే రూ. 50 గురించి తెలుసుకుంటే వైసీపీ నేతల్ని మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వరన్నారు.
ఏమారితే ప్రజల ముఖాలకు కూడా రంగులు వేసే వ్యక్తి సీఎం జగన్ అని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్‌రెడ్డి విధానాల వల్లే రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి పోయిందని విమర్శించారు. మరోవైపు పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్వాసితులకు సంబంధించి 1,000 ఎకరాల పరిహారాన్ని బోగస్ పట్టాలతో వైసీపీ నేతలు కొట్టేస్తున్నారని ఆరోపించారు. దీనిపై టీడీపీ అధికారంలోకి రాగానే సీబీఐ విచారణ జరిపిస్తుందని వెల్లడించారు. వైసీపీ పని అయిపోయిందని.. ఇక గెలిచే అవకాశం లేదని జోస్యం చెప్పారు.