సీఎం కడప జిల్లా పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకొంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ పేరు విన్నా.. ఆయన కటౌట్ చూసినా.. చాలామంది ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది. గతంలో చాలాసార్లు ఇది రుజువైంది కూడా. తాజాగా.. ముఖ్యమంత్రి కడప జిల్లా పర్యటనలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. ఓ వృద్ధురాలు సీఎం జగన్ దగ్గరికి వచ్చి ఆప్యాయంగా మాట్లాడారు. జగన్ కూడా ఆ వృద్దురాలితో సరదాగా గడిపారు. ఆమెను నవ్వించారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను చూసి.. ఆ వృద్ధురాలు కూడా మురిసిపోయింది. మనసారా నవ్వింది. ఆశీర్వదించింది.
జగన్ కడప జిల్లా పర్యటనలో భాగంగా.. పులివెందుల ఎస్‌సీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మూలి బలరామిరెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకలకు హాజరయ్యారు. నూతన వధూవరులు అశ్వినిరెడ్డి, రామ తేజేశ్వర్ రెడ్డిలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వదించారు. అక్కడినుంచి బయల్దేరుతుండగా.. ఎర్రబెల్లి గ్రామానికి చెందిన వృద్దురాలు వెంకటమ్మప్ప జగన్‌ను పిలిచారు. దీంతో ఆమెను గుర్తించిన జగన్.. సిబ్బందికి చెప్పి దగ్గరకు తీసుకురావాలని సూచించారు. ఆప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి జగన్.. వెంకటమ్మప్పతో కాసేపు సరదాగా మాట్లాడారు. ఆమె కూడా ఎలాంటి భయం లేకుండా.. ప్రేమగా మాట్లాడి.. జగన్‌ను హత్తుకున్నారు.