వైసీపీ నేతలపై కందుకూరు టీడీపీ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహించిన రోడ్ షోలో తొక్కిసలాట కారణంగా 8 మంది మృతి చెందిన ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే సాక్షులుగా పెట్టించి అధికారులు అసత్యాలు చెప్పిస్తున్నారని ఇంటూరి నాగేశ్వరరావు ఆరోపించారు. కందుకూరు, గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలపై విజయవాడ ప్రభుత్వ అతిథి గృహంలో జస్టిస్ శేషశయనారెడ్డి కమిషన్ ఎదుట టీడీపీ నేతలు ఇంటూరి నాగేశ్వరరావు, తెనాలి శ్రావణ్ కుమార్ విచారణకు హాజరయ్యారు.
అనంతరం ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కందుకూరు ఘటనపై వైసీపీ కార్యకర్తలనే సాక్షులుగా పెట్టించి అధికారులు అసత్యాలు చెప్పిస్తున్నారని ఆరోపించారు. వారంతా వైసీపీ శ్రేణులేనని వచ్చే విచారణలో తాము నిరూపిస్తామని వెల్లడించారు. కందుకూరు రోడ్ షో కార్యక్రమంతో సంబంధం లేకుండా వారు అక్కడికి ఎలా వచ్చారో కూడా చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారని, ఈసారి అన్ని ఆధారాలతో మళ్లీ హాజరవుతామని వెల్లడించారు.
గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. గుంటూరు ఘటనలో క్షతగాత్రులు, పాత్రధారులను క్రాస్ ఎగ్జామిన్ చేస్తారా అని అడిగారని తెలిపారు. తాము అనుమతి తీసుకునే ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పామని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకలు ప్రజల మధ్య జరుపుకునేందుకు చంద్రబాబు వచ్చారని, దురదృష్టవశాత్తూ ఆ రోజు విషాదకర ఘటన జరిగిందన్నారు. అనుమతికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని కమిషన్‌కు తెలిపామన్నారు. తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను కమిషన్‌కు అందజేసినట్లు శ్రావణ్ కుమార్ వెల్లడించారు.