తన పాదయాత్రలో అన్ని వర్గాలను ఆకట్టుకొనే దిశగా తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అడుగులేస్తున్నారు. తన సొంత డబ్బుతో ఓ మహిళకు చేయూత అందించారు. పాదయాత్రలో ఉన్న తనకు కొబ్బరి నీళ్లు ఇచ్చి దాహార్తి తీర్చిన ఆ మహిళకు ఊహించని కానుక ఇచ్చారు. స్వయం ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్న మస్తానమ్మ అనే మహిళకు ఓ తోపుడు బండి ఉంటే కొబ్బరిబోండాలు అమ్ముకునేందుకు మరింత ఉపయోగంగా ఉంటుందని భావించిన లోకేష్.. తన సొంత డబ్బుతో బండి చేయించి కానుకగా పంపించారు.
పాదయాత్రలో భాగంగా తన వద్దకు వచ్చిన లోకేష్‌కు.. మస్తానమ్మ కొబ్బరి నీళ్లిచ్చి అభిమానం చాటుకుంది. తాను ఇచ్చిన కొబ్బరి నీళ్లను లోకేష్ తాగడంతో.. ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మస్తానమ్మ పేదరికాన్ని గమనించిన లోకేష్ తోపుడు బండిని సాయం చేశారు. దీంతో బుధవారం టీడీపీ నాయకులు ఆమెకు ఈ తోపుడు బండిని అందజేశారు. లోకేష్ సాయంపై మస్తానమ్మ ఆనందం వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే నారా లోకేష్ ‘యువగళం’ పేరులో చిత్తూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. బుధవారం ఉదయం సత్యవేడు నియోజకవర్గం పిచాటూరులో యాత్ర చేపట్టారు. తనకు ఎదురైన ఓ ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణికులను ఆప్యాయంగా పలకరించారు. బస్సులో కాసేపు ప్రయాణించిన లోకేష్.. టీడీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ ఛార్జీలు ఎంత? ప్రస్తుత వైసీపీ పాలనలో ఛార్జీల మధ్య వ్యత్యాసాన్ని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్సులు ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజలకు భారం పెంచారని లోకేష్ విమర్శించారు. అలాగే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సిబ్బంది పడుతున్న ఇబ్బందుల గురించి కండక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.