అన్నదమ్ముల అనుబంధానికి ఓ బ్రదర్ ఆదర్శంగా నిలిచాడు. ఇద్దరు అన్నదమ్ములు తమ పిల్లలను పరస్పరం మార్చుకున్నారు. తమ్ముడి కుమార్తెను దత్తత తీసుకున్న అన్న.. బదులుగా తన కుమారుడిని తమ్ముడికి ఇచ్చాడు. తమ్ముడికి ఇప్పటికే ఒక కుమార్తె ఉండగా.. రెండు నెలల కిందట అతడి భార్య రెండో కుమార్తెకు జన్మనిచ్చింది. అన్నకు ఇద్దరు కుమారులు ఉన్నారు. దీంతో రెండేళ్ల వయసున్న తన రెండో కుమారుడిని తమ్ముడికి ఇచ్చి, బదులుగా అతడి కుమార్తెను తీసుకున్నాడు అన్న. కుటుంబసభ్యులు, బంధువుల మధ్య దత్తత కార్యక్రమం వేడుకగా జరిగింది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా షెగావ్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు బిరుదేవ్ మానే, అప్పాసో మానే తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది.
వీరిది ఉమ్మడి కుటుంబం. ఇద్దరు సోదరులూ తమ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నారు. అందరూ కలిసి మెలిసి ఆప్యాయంగా ఉంటున్నారు. ఈ ఇద్దరు సోదరుల్లో బిరుదేవ్ మానే పెద్దవాడు. బిరుదేవ్‌కు ఐదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. రెండేళ్ల కిందట అతడికి మరో కుమారుడు జన్మించాడు. అప్పాసోకు నాలుగేళ్ల కుమార్తె ఉండగా.. 2 నెలల కిందట మరో కుమార్తె పుట్టింది.
కొత్తగా తమ కుటుంబంలోకి సభ్యురాలికి వచ్చిన చిన్నారికి ఈ కుటుంబం ఘనంగా స్వాగతం పలికింది. మిఠాయిలు పంచుకొని వేడుకలా చేసుకుంది. అన్నదమ్ములిద్దరికీ ఇద్దరేసి పిల్లలు సంతానంగా ఉన్నా, ఎక్కడో ఏదో వెలితి. అందరిలాగే తనకూ ఓ కుమారుడు ఉంటే బాగుండునని అప్పాసో భావించాడు. తనకు ఆడపిల్ల ఉంటే బాగుండేదని పెద్దవాడు బిరుదేవ్ అనుకున్నాడు. ఈ క్రమంలో ఒకరి పిల్లలను మరొకరు దత్తత తీసుకోవాలని సోదరులిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. తమ ఆలోచనను తల్లిదండ్రులతో పంచుకోగా, వారు దానికి మిక్కిలి సంతోషం వ్యక్తం చేశారు. దత్తత కార్యక్రమాన్ని నిర్వహించారు.
బిరుదేవ్ చిన్న కుమారుడు ఆరుశ్ (2 ఏళ్లు)ను అప్పాసో దత్తత తీసుకోగా.. అప్పాసో 2 నెలల కుమార్తెను బిరుదేవ్ దత్తత తీసుకున్నాడు. నామకరణం కార్యక్రమం రోజునే దత్తత కార్యక్రమం నిర్వహించారు. ఆ చిన్నారికి అన్విత అని పేరు పెట్టారు. ఈ అన్నదమ్ములు తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకం అని పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.