డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం సముద్ర తీర చిర్ర యానాం గ్రామంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన 15ఏళ్ల బాలికపై అధికార పార్టీకి చెందిన నాయకుల కుమారులు ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో గ్రామ పెద్దల సమక్షంలో రూ.లక్ష ఇవ్వజూపారు. వారు నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయవద్దంటూ బెదిరించారు. ఈ నెల 6న బాలిక బట్టలు ఉతికేందుకు తీరప్రాంతంలో ఉన్న సరుగుడు తోటల మధ్యకు వెళ్లింది. ఆమెను ఐదుగురు యువకులు పక్కనే ఉన్న గుబురులోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు సమాచారం. తీవ్రఅస్వస్థతకు గురైన బాలికను కుటుంబ సభ్యులు ఆరాతీయగా గ్రామానికి చెందిన వైసీపీ నేతల కుమారులు దారుణానికి పాల్పడినట్టు చెప్పింది. నిందితులు బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం డీఎస్పీ వై.మాధవరెడ్డి సిబ్బందితో వెళ్లి విచారణ చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఓలేటి తేజ, ఓలేటి తులసిరావు (తులసి), మల్లాడి వంశీ, ఓలేటి ధర్మరాజు, అర్ధాని సత్తిపండులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు కాట్రేనికోన ఎస్‌ఐ పి.శ్రీనివాస్ తెలిపారు.