తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్ల మండలం ఘంటవారిగూడెం ఎంపీటీసీ యలమర్తి సూర్యకుమారి తనయుడు వైసీపీ నాయకుడు యలమర్తి వాసుపై సోమవారం సాయంత్రం హత్యాయత్నం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం వాసు గ్రామానికి దూరంగా ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో తన తల్లిదండ్రులతోపాటు ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం 5 గంటలకు పొలంలో ఉన్న తన ఇంటికి రాగా ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కారును చుట్టుముట్టి డ్రైవర్ సీటులో వాసు ఉన్నాడనుకుని కత్తితో కారు అద్దం పగులగొట్టారు. వెనుక సీటులో ఉన్న వాసు అనుచరులు, పక్క సీటులో ఉన్న వాసు ఒక్కసారిగా దిగడంతో దుండగులు కత్తిని, ఇతర మారణాయుధాలను అక్కడే వదిలి పారిపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ లక్ష్మణరెడ్డి, ఎస్ఐ నరసింహమూర్తి సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీని వెనుక ఆస్తి తగాదాలా, రాజకీయ కక్షలా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. వాసు పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రాణ రక్షణ కల్పించాలని కోరారు.