తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వాలంటూ సుదీర్ఘకాలంపాటు వివిధ తెలుగు సంఘాల నుంచి డిమాండ్ వినిపించింది. చివరకు 2008 అక్టోబర్ 31న కేంద్ర ప్రభుత్వం కన్నడంతోపాటూ తెలుగుకి ప్రాచీన హోదా ప్రకటించింది. ఫలితంగా గత మూడేళ్లలో తెలుగు భాషాభివృద్ధికి కేంద్రం రూ. 3 కోట్లు కేటాయించిందని ఇటీవల రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటించారు. అదే సమయంలో సంస్కృతం, తమిళ భాషలకు కేంద్రం ఏటా రూ. 6 కోట్లకు పైగా అందించింది. దాంతో ఆయా భాషల్లో పరిశోధనకు అవకాశాలు మెరుగ్గా ఉన్నట్టు కనిపిస్తోంది.