‘‘కోట్ల మంది బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అణగదొక్కారు. తల్లకిందులుగా తపస్సు చేసినా, పొర్లు దండాలు పెట్టినా.. జగన్‌రెడ్డిని బీసీలు నమ్మరు. వైసీపీకి మళ్లీ ఓటేసేదే లేదు’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం ఆయన ఓ ప్రకటన చేశారు. ఒకరిద్దరికి పదవులిచ్చి, రాజకీయంగా వాడుకున్నంత మాత్రాన జగన్‌రెడ్డిని బీసీలు నమ్మే పరిస్థితి లేదు. నలుగురికి పదవులివ్వడం బీసీలను ఉద్ధరించినట్లా? బీసీలకు రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థల్లో దక్కిన 33% రిజర్వేషన్లను కుదించి, 16,800 మందికి పదవులు రాకుండా చేసిన జగన్‌రెడ్డికి బీసీల ఊసెత్తే అర్హత లేదు. సుమారు 26 మంది బీసీ నేతల్ని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. వందల మందిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. వేలాది మందిపై దాడులకు పాల్పడ్డారు. బీసీల అభ్యున్నతికి ఖర్చు చేయాల్సిన రూ.34 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధుల్ని మళ్లించారు. 8 వేల ఎకరాల బీసీల అసైన్డ్ భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. బీసీలకు మేలు చేసే 30కి పైగా పథకాలను నిలిపివేశారు’’ అని ఆరోపించారు.