తాజాగా నాసా ఆసక్తికర అంశం వెల్లడించింది. ఇదిలావుంటే అమెరికాలో భారీ ఉల్కాపాతం చోటు చేసుకుంది. సుమారు అరటన్ను బరువు ఉండే అస్టరాయిడ్ భూమిని తాకింది. దీని దెబ్బకు భారీ గొయ్యి ఏర్పడింది. భారీ శబ్దం చేస్తూ ఉల్క నేలను తాకిన అనంతరం దుమ్ము, ధూళి సమీప ప్రాంతాలను కమ్ముకున్నాయి. స్వల్పంగా భూమి కంపించిందంటూ వార్తలు వెలువడ్డాయి. సోనిక్ బూమ్ ఏర్పడింది.
ఈ వరుస ఘటనలతో- పరిసర ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. టెక్సాస్ దక్షిణ ప్రాంతంలోని మెక్అలెన్ ప్రాంతంలో ఈ భారీ ఉల్క భూమిని తాకింది. అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ విషయాన్ని ధృవీకరించింది. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఉల్కాపాతం సంభవించినట్లు డల్లాస్ లోని ఫాక్స్ స్టేషన్ కేడీఎఫ్‌డబ్ల్యూ వెల్లడించింది.ఈ ఉల్క బరువు సుమారు అర టన్ను ఉంటుందని అంచనా వేసింది. వెయ్యి పౌండ్ల బరువు, రెండు అడుగుల వెడల్పు ఉందని తెలిపింది. ఉల్కా నేలను తాకిన ప్రదేశాన్ని గుర్తిస్తూ ఓ మ్యాప్ ను నాసా విడుదల చేసింది. మెక్‌అలెన్ కు పశ్చిమ దిక్కున భూమి వైపునకు ఈ ఉల్క దూసుకొచ్చిన దృశ్యాన్ని జియోస్టేషనరీ లైట్నింగ్ మ్యాపర్ రికార్డు చేసింది.
ఆ సమయంలో హ్యూస్టన్ మీదుగా ప్రయాణిస్తోన్న రెండు విమానాల పైలెట్లు కూడా ఈ ఉల్కను చూసినట్లు హిడాల్గో కౌంటీ షెరీఫ్ ఎడ్డీ గుయెర్రా పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విటర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. హ్యూస్టన్ లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు ఆ రెండు విమానాల పైలెట్లు సమాచారం ఇచ్చారని తెలిపారు.గురుత్వాకర్షణకు గురైన తరువాత సాధారణంగా ఉల్కలు అంచనాలకు అందని వేగంతో భూమి వైపునకు దూసుకొస్తాయి. భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు సంభవించే ఒత్తిడి వల్ల వాటి వేగం తగ్గుతుంది. భూమిని ఢీకొనే ముందు చిన్న చిన్న ముక్కలుగా విచ్ఛిన్నమౌతాయి. వీటి వల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని నాసా తెలిపింది.