దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్యోదంతం తర్వాత ఇలాంటి ఘటనే దేశంలో పలు చోట్ల జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, మరో దారుణ ఘటన వెలుగుచూసింది. అస్సాంలోని గౌహతిలో ఓ మహిళ తన భర్త, అత్తను దారుణంగా హత్య చేసి.. ముక్కలుగా కోసేసింది. ఆ తర్వాత వారి శరీర భాగాలను మరో రాష్ట్రంలోని కొండల్లో విసిరేసింది. ఈ ఘటన ఆ రెండు రాష్ట్రాల్లోనేగాక, దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు వెల్లడించారు.
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వందన కలీట అనే మహిళ తన ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి భర్త అమరేంద్ర డే, అత్త శంకరి డేలను ఏడు నెలల క్రితమే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని చంపేసిన తర్వాత వారి శరీర భాగాలను ముక్కలుగా కోసి.. తర్వాత వాటిని పాలిథీన్ కవర్లలో ప్యాక్ చేసి ఫ్రిజ్లో పెట్టింది. మూడు రోజుల తర్వాత వాటిని గౌహతికి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో మేఘాలయాలోని చిరపుంజికి తన ప్రియుడితో కలిసి వెళ్లి అక్కడి కొండల్లో విసిరేసిందని పోలీసులు వెల్లడించారు. గత ఆగస్టు-సెప్టెంబర్లోనే ఈ ఘటన జరిగినప్పటికీ.. ఈ ఆదివారం కొన్ని శరీర భాగాలను మేఘాలయాలో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.భర్త, అత్త హత్య అనంతరం ఫిర్యాదు చేసి దొరికేసింది
భర్త, అత్త హత్యలపై ఎవరికీ అనుమానం రాకూడదని నిందితురాలు వందన కలీట పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలోనే తన భర్త, అత్త కనిపించడం లేదంటూ పిర్యాదు చేసింది. అయితే, కొన్ని రోజుల తర్వాత అమరేంద్ర డే కజిన్ కూడా మిస్సింగ్ కంప్లయింట్ ఇవ్వడంతో పోలీసులకు అనుమానాలు వచ్చాయి. నూన్మతి పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు కావడంతో.. వందన ప్రవర్తన పట్ల సందేహాలు వ్యక్తం చేసిన పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో ఆ తల్లీకొడుకులను వందన హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ హత్యలు చండ్మరి, నారేంగి అనే వేర్వేరు ప్రాంతాల్లోని రెండు ఇళ్లల్లో జరిగినట్లు గుర్తించారు.