తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు షాకిచ్చేలా ఆయన్ని ఓ మహిళా మీ పేరు ఏమిటీ అని ప్రశ్నించింది. ఇదిలావుంటే నారా లోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్ర.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా.. లోకేష్ వివిధ వర్గాల ప్రజలతో సమావేశం అవుతున్నారు. మంగళవారం కూడా లోకేష్ మైనార్టీలతో ముఖాముఖీగా మాట్లాడారు. ఈ సమయంలో.. ఓ మహిళ మాట్లాడుతూ.. 'సార్.. మీ పేరు నాకు తెలియదు.. మీరెవరో నాకు తెలియదు' అని.. స్పష్టం చేసింది. దీంతో లోకేష్, అక్కడున్న నేతలు అవాక్కయ్యారు. అయితే నారా లోకేశ్ ధైర్యం చెప్పి.. ఏం పర్లేదు మాట్లాడండి అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముస్లిం మైనారిటీ సోదరులు అధికంగా ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలను ఒక యూనిట్‌గా తీసుకొని.. అక్కడ ముస్లిం మహిళల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని.. పాదయాత్రలో ముస్లింలకు నారా లోకేష్ హామీ ఇచ్చారు. అనంతరం వైసీపీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. 'తన కూతురు కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకొని క్లాస్‌లో ఫస్ట్ వస్తుందని మిస్బా అనే అమ్మాయికి టీసీ ఇప్పించి స్కూల్ నుండి తొలగించారు ఒక వైసీపీ నేత. అది తట్టుకోలేని ఆ చదువుల తల్లి ఆత్మహత్య చేసుకుంది. మిస్బా తల్లిదండ్రులు నన్ను కలిస్తే వారి ఇల్లు, స్థలాలను కబ్జా చేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ఆలోచించండి' అని లోకేష్ వ్యాఖ్యానించారు.