పల్నాడులో ఆధిపత్యపోరుకు టీడీపీ నేత బలయ్యారు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటి రెడ్డి మృతి చెందారు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. 20 రోజులుగా ఆయన మృత్యువుతో పోరాడారు. మంగళవారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. రొంపిచర్ల మండలంలోని అలవాల గ్రామంలో ఫిబ్రవరి ఒకటో తేదీ రాత్రి.. బాలకోటిరెడ్డి ఇంట్లో ఉండగా తుపాకీతో నిందితులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాలకోటి రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను నరసరావుపేటలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు.
నరసరావు పేట వైద్యులు ఆపరేషన్ చేసి బుల్లెట్‌ను బయటకు తీశారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో.. ఆరోగ్యం క్షీణించింది. దీంతో శుక్రవారం ఉదయం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కానీ.. వైద్యుల ప్రయత్న ఫలించలేదు. ఆయన కన్నుమూశారు. బాలకోటిరెడ్డి టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. మండల అధ్యక్షుడిగా, ఎంపీపీగా, గ్రామ సర్పంచిగా పని చేశారు. కోడెల శివప్రసాద్‌కి నమ్మిన బంటుగా ఆయను పేరుంది. అంతేకాదు.. రొంపిచర్ల మండలంలో టీడీపీ అభివృద్ధికి ఆయన కృషి చేశారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయడమే.. బాలకోటి రెడ్డికి శత్రువులను పెంచింది. అలవాల పంచాయతీ ఎన్నికల సమయంలో.. టీడీపీ, వైసీపీ హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. అప్పటినుంచి గ్రామంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వర్గపోరు మొదలైంది. ఈ వర్గపోరుకి అలవాల తిరునాళ్ల మరింత అజ్యం పోసింది. టీడీపీలోని రెండు వర్గాలు రెండు ప్రభలను, వైసీపీకి చెందిన రెండు వర్గాలు రెండు ప్రభలు కట్టారు. ప్రభల వద్దకు ఇరు పార్టీల నేతలు వచ్చిన క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
తిరునాళ్లలో ఆ వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ.. అది కాస్తా పార్టీ రంగు పులుముకొని మరిన్ని వివాదాలకు దారి తీసింది. పార్టీల పరంగా వివాదాలు సద్దుమణిగినా.. ఆధిపత్య పోరు మాత్రం తగ్గలేదు. దీంతో తరుచూ గొడవలు జరిగాయి. ఈ ఆధిపత్య పోరులో భాగంగానే ఆరు నెలల వ్యవధిలో వెన్నా బాలకోటిరెడ్డిపై రెండుసార్లు దాడులు జరిగాయి. కానీ.. ఫిబ్రవరి ఒకటిన మాత్రం బాలకోటి రెడ్డి తప్పించుకోలేకపోయారు. తన ప్రత్యర్థుల తూటాలకు బలయ్యారు. ఆయనపై దాడి ఘటన పల్నాడు జిల్లాలో సంచలనంగా మారింది.