‘‘మనం చేస్తున్నది రాజకీయ పోరాటం కాదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే పోరాటం చేస్తున్నాం. ఉన్మాదులతో తలపడుతున్నాం. మీలాంటి సైకోలను, రౌడీలను చరిత్రలో చాలామందిని చూశాం’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఏలూరు సమీపాన చొదిమెళ్ల శివారులోని జోన్-2 తెలుగుదేశం శిక్షణా శిబిరానికి వెళ్తూ మార్గమధ్యంలో ఆయన గన్నవరంలో ఆగారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా కుటుంబాన్ని పరామర్శించారు. ధ్వంసమైన పార్టీ కార్యాలయాన్ని, దహనమైన కార్లను పరిశీలించారు. అనంతరం అక్కడ మీడియాతో, శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. ‘‘టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో అందరం ముందుకు పోదాం. వ్యవస్థకు చెడు పురుగులు ఎవరున్నా సరే తొలగించాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. అదే భవిష్యత్తులో జరుగుతుంది’’ అని తెలియ చేశారు.