భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం సీతారాముల నిత్యకళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకొచ్చి భద్రుడి గుడిలో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన స్వామి వారి నిత్య కల్యాణమూర్తులను ఆలయ బేడా మండపంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కూర్చుండబెట్టి ముందుగా విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం చేశారు.
స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. స్వామి వారి, అమ్మవార్ల వంశ క్రమాన్ని భక్తులకు తెలియజేశారు. అర్చకులు ఆలయ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. ఈ నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామివారికి విన్నవించారు. వేద పండితులు వేద ప్రవచనాలు చేశారు. అనంతరం సీతారాములకు ఘనంగా నిత్యకళ్యాణం చేశారు. అర్చకులు స్వామి వారి శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.