వివాహేతర సంబంధం నేపధ్యంలో భార్య ప్రియుడు అతడి స్నేహితులతో కలిసి భర్తను తీవ్రంగా గాయపర్చటంతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఉమ్మడి కృష్ణ జిల్లా, వీరులపాడు మండలం జుజ్జూరు లో జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... జుజ్జూరుకు చెందిన కుంచం రామారావు (45) గ్రామంలో రేషన్ డీలర్‌గా, జేసీబీలతో కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్నాడు. జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ రామారావు భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై భార్యభర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ప్రియుడు ప్రవీణ్, అతడి స్నేహితులు పులి రాజేష్ (బుజ్జి), ముత్తుతో కలిసి ఇంటివద్దనే రామారావుతో గొడవ పడ్డారు. ఘర్షణలో రామారావు తీవ్రంగా గాయపడటంతో ప్రవీణ్ అతని స్నేహితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానికులు రామారావు సోదరుడు శ్రీనుకు సమాచారం అందించడంతో బాధితుడిని నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున రామారావు మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. వదిన భార్గవి, ప్రవీణ్, పులి రాజేష్, ముత్తులు కొట్టటం వల్లనే తీవ్రంగా గాయపడిన తన సోదరుడు మృతి చెందినట్టు శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుడు రామారావు గతంలో టీడీపీ తరపున వీరులపాడు మండల జడ్పీటీసీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమిచెందాడు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.