ఏలూరు జిల్లా నూజివీడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆగిరిపల్లి మండలం ఈదులగూడేనికి చెందిన కందుల వెంకట కోటేశ్వరరావు కుమారుడు నీలమణికంఠ (4) నూజివీడులోని విజ్‌డమ్ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. పాఠశాలలో శనివారం సాయంత్రం విరామ సమయంలో మూత్ర విసర్జనకు బాత్‌రూమ్‌కు వెళ్లగా ఇటీవల నిర్మించిన గోడ విరిగిపడటంతో మణికంఠ తీవ్ర గాయాలపాలు కాగా మరో ఇద్దరు విద్యార్థులకు కూడా గాయాలయ్యాయి. మణికంఠను నూజివీడు అమెరికన్ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా ఇద్దరు ఆడపిల్లల తరువాత కలిగిన ఏకైక మగ సంతానం మణికంఠ చురుగ్గా ఉండేవాడని, పాఠశాల యాజమాన్యం తమ పిల్లవాడిని పొట్టనపెట్టుకుంటుందని ఊహించలేకపోయామని బాలుడి తల్లిదండ్రులు విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నూజివీడు పట్టణ ఎస్‌ఐ శివన్నారాయణ తెలిపారు. నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు బాలుడి తల్లిదండ్రులను పరామర్శించారు.