అనంతపురం జిల్లా, కంబదూరు మండల పరిధిలోని దేవేంద్రపురం గ్రామానికి చెందిన రైతు బాలునాయక్ (40) శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కళ్యాణదుర్గం మండలం వర్లి గ్రామంలో బాలునాయక్కు 5 ఎకరాల పొలం ఉంది. ఇందులో టమోటా, మిరప పంటలను సాగు చేశాడు. పెట్టుబడులకు, బోర్లు వేయించేందుకు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్ద సుమారు రూ.10 లక్షలు అప్పు చేశాడు. పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో శనివారం తోటకు వెళ్లి పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉండగా పక్క పొలాల రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. వారు 108 అంబులెన్సలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య భాగ్యమ్మ, కుమారులు సురేష్, మహేష్ ఉన్నారు. కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.