పారిశ్రామిక రంగంపై విద్యార్థులు గురిపెట్టాలని అనంతపురం జేఎనటీయూ వీసీ రంగజనార్దన సూచించారు. జేఎనటీయూ ఓటీపీఆర్‌ఐ కాలేజ్ డే వేడుకలను కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వీసీ, ప్రత్యేక అతిథిగా జాతీయ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు శ్రీకాంతరెడ్డి, సినీనటులు నీలా రమణ, గాయత్రి రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ తైల పరిశోధనకోసం 1949లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఓటీపీఆర్‌ఐను ఏర్పాటు చేశారని అన్నారు. అప్పటి నుంచి వివిధ కోర్సులను ప్రవేశ పెడుతూ దినదినాభివృద్ధి చేశారని, ఇక్కడ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని అన్నారు. మిగిలిన విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసానికి వెళుతున్నారని అన్నారు. క్రీడల్లో పాల్గొంటే చదువులోనూ చురుకుగా వ్యవహరిస్తారని శ్రీకాంతరెడ్డి అన్నారు. వేడుకల సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం సంప్రదాయ, ఆధునిక సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులు, సినీ నటులు అలరించారు.