రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి మరోసారి సుప్రీంకోర్టులో నిరాశ తప్పలేదు. మరోసారి ఏపీ రాజధాని కేసు వాయిదా పడింది. వచ్చే నెల 28న ఏపీ రాజధాని కేసు వాయిదా పడింది. ఏపీ రాజధాని కేసు త్వరగా విచారించాలని సుప్రీంకోర్టు లో ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణను వచ్చే నెల 28న ఫిక్స్ చేసింది. ఈ కేసును జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని కేసులు, అమరావతి పిటిషన్ల పై త్వరగా విచారణ జరపాలని సుప్రీం కోర్టును కోరింది. ప్రభుత్వం త్వరగా విచారణ చేపట్టాలని కోరినా మరోసారి వాయిదా పడటం నిరాశ మిగిల్చింది. మార్చి 28న జరిగే విచారణపై ఉత్కంఠ మొదలైంది.
అమరావతి రైతుల తరపు లాయర్లు జనవరి 27న కోర్టు ఇచ్చిన నోటీసులు తమకు అందాయన్నారు. తాము కౌంటర్ దాఖలు చేయడానికి కనీసం రెండు వారాల సమయం ఇవ్వాలని కోరారు. ఈ నెల 23న విచారణ జరుపుతామని తెలిపారు.. కానీ ఆ రోజు విచారణ జరగలేదు.. ఇప్పుడు తాజాగా మార్చి 28కి మరోసారి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులపై ఏపీ హైకోర్టుతీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని.. స్టే విధించాలని కోరింది. ఇటు అమరావతి రైతులు కూడా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై త్వరగా విచారణ జరపాలని ప్రభుత్వం కోరుతోంది.
మరోవైపు ఏపీ ప్రభుత్వం విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని భావిస్తోంది. ఉగాదికి సాగర తీర నగరానికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఉగాది తర్వాత కోర్టులో విచారణ జరగనుండటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. సీఎం జగన్ ఢిల్లీలో ఇటీవల కీలక వ్యాఖ్యలు ఆసక్తికంగా మారాయి. విశాఖ నుంచి త్వరలోనే పాలన ప్రారంభమవుతుందని.. తాను కూడా అక్కడికే షిఫ్ట్ అవుతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తామనడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతానికి కోర్టు పరిధిలో ఉన్న అంశం గురించి సీఎం, మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారని.. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది అంటున్నారు. ఇప్పటికే పలువురు సీఎం, మంత్రులపై సుప్రీం కోర్టు అటార్నీ జనరల్‌కు ఫిర్యాదు చేశారు.