నెలలోపు వేలకోట్ల అప్పులు తీర్చేయనున్నట్లు ఆదానీ గ్రూప్ తాజాగా ప్రకటించింది. ఇదిలావుంటే అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్ మార్కెట్ విలువతో పాటు.. అదానీ వ్యక్తిగత సంపద కూడా కుప్పకూలిపోతోంది. ఇదే క్రమంలో ఇన్వెస్టర్లలో విశ్వాసం తిరిగి నింపుకునేందుకు అదానీ ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటివరకు అవేమీ ఫలించలేదు. కానీ ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఈ మార్చి నెలాఖరులోగా తాము తీసుకున్న షేర్ బ్యాక్డ్ లోన్లను తిరిగి చెల్లించాలని యోచిస్తోందట. ఇది మొత్తంగా 690 మిలియన్ డాలర్ల నుంచి 790 మిలియన్ డాలర్ల వరకు ఉంది. ఈ వ్యవహారం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు రాయిటర్స్‌కు దీని గురించి చెప్పారట. షార్ట్ సెల్లర్ అటాక్ నుంచి కోలుకోవడానికి.. అదానీ గ్రూప్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో ఇన్వెస్టర్లలో కోల్పోయిన విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు అదానీ గ్రూప్ సింగపూర్, హాంకాంగ్‌ల్లో ఫిక్స్‌డ్ ఇన్‌కం రోడ్‌షోకు ఫిక్స్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు లోన్లు చెల్లించాలనే మరో ప్లాన్ రచించినట్లు సమాచారం. ఇక దీంతో పాటు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కూడా 800 మిలియన్ డాలర్ల విలువైన 2024 బాండ్లను 3- ఇయర్ క్రెడిట్ లైన్ ద్వారా రీఫైనాన్స్ చేయాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
హిండెన్‌బర్గ్ రిపోర్ట్ గత నెల అంటే జనవరి 24న విడుదలైంది. అప్పటినుంచి దాదాపు 25 ట్రేడింగ్ సెషన్లలోనే అదానీ గ్రూప్ 7 కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 140 బిలియన్ డాలర్లకుపైగా పతనమైంది. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ ఫ్రాడ్స్ చేస్తోందని.. హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఇక అప్పటినుంచి ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్‌పై నమ్మకం కోల్పోయారు. ఇక విపరీతమైన అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఇదే క్రమంలో రూ.20 వేల నిధుల సమీకరణే లక్ష్యంగా తీసుకొచ్చిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పీఓను కూడా రద్దు చేసుకున్నారు గౌతమ్ అదానీ. అయినా ఇదేమీ ఫలితాన్నివ్వలేదు.
ఇక గౌతమ్ అదానీ.. పలు బ్యాంకులకు కూడా వేల కోట్ల మేర రుణాలు ఇవ్వాల్సి ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా ఇతర చాలానే బ్యాంకులు లిస్ట్‌లో ఉన్నాయి. అయితే.. అదానీ గ్రూప్ తమ వద్ద తీసుకున్న అప్పులకు సరిపడా ప్రాపర్టీ డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నట్లు ఎస్బీఐ ఇటీవల చెప్పింది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా.. తాము ఇప్పటికీ అదానీ గ్రూప్‌కు అప్పులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ బ్యాంక్ సీఈఓ కూడా ఇటీవల చెప్పారు.