ప్రపంచంలో నియంత పాలకుడు అంటే అందరూ చెప్పే పేరు ఉత్తర కొరియా పాలకుడు అని. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా అధినేత పైత్యం రోజు రోజుకూ ముదిరిపోతోంది. విచిత్రమైన ఆంక్షలు, వింత నిర్ణయాలతో ప్రజలను బందీలుగా చేస్తూ వారి స్వేచ్ఛను హరిస్తున్నారు. బయట ప్రపంచంతో దాదాపు సంబంధాలు తెగిపోయి అక్కడి ప్రజలు జైలు పక్షుల్లుగా బతుకుతున్నారు. నియంత కిమ్ జోంగ్ ఉన్ విపరీత పోకడలతో జనం విసుగెత్తిపోతున్నారు. తాజాగా, కిమ్ దృష్టి హాలీవుడ్ సినిమాలపై పడింది. ఈ సినిమాల ప్రభావంతో ఎవరైనా తనపై తిరుగుబాటు చేస్తే పరిస్థితి చేజారుతుందనే అనుమానంతో ఏకంగా నిషేధం విధించారు. ఈ విషయంలో ఎవరైనా ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తమ పిల్లలు హాలీవుడ్ లేదా విదేశీ సినిమాలను చూస్తూ దొరికితే.. తల్లిదండ్రులను జైలుకు పంపుతామని ప్రకటించారు. మొదటి తప్పుగా తల్లిదండ్రులను కార్మిక శిబిరాలకు తరలించి, ఆరు నెలలపాటు అక్కడే ఉంచుతారు. పిల్లలకు సైతం ఐదేళ్లు శిక్ష విధించి శిబిరాలకు పంపుతామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు ఉత్తర కొరియా విశిష్టత గురించి తెలియజేయాలని, అలా కాకుంటే వారు కిమ్ అనుసరించే సామ్యవాద వ్యతిరేకులుగా మారే ప్రమాదం ఉందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే, ఇంతకుముందు ఇటువంటి నేరాల్లో దోషులుగా తేలిన తల్లిదండ్రులు కఠినమైన హెచ్చరికతో సరిపెట్టుకునేవారు. గతంలో దక్షిణ కొరియా సినిమాల క్యాసెట్లతో దొరికిన ఇద్దరు బాలలకు మరణశిక్ష విధించినట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఎవరైనా అశ్లీల వీడియోలు, పోర్న్ సినిమాలు చూస్తున్నట్టు సమాచారం వస్తే కాల్చి చంపాలని గత నెలలో ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ఆంక్షలు కేవలం విదేశీ సినిమాలకే పరిమితం కాదు. డ్యాన్సులు చేయడం, పాటలు పాడటం కూడా నేరమే. దక్షిణ కొరియా వంటి దేశాలకు చెందిన డ్యాన్సులు చేస్తే ఆరు నెలల జైల్లో వేస్తారు. కిమ్ సరికొత్త ఆంక్షలతో ఉత్తర కొరియా ప్రజలు తమకు ఇష్టమైన విదేశీ సినిమాలు చూడలేక ఉసూరుమంటున్నారు.
గత ఏడాది మే నెలలోనే టైట్ జీన్స్, హెయిర్ స్టైల్స్‌పై ఉత్తర కొరియా నిషేధం విధించింది. విదేశీ ఫ్యాషన్ అలవాట్లను ‘ప్రమాదకరమైన విషం’గా కిమ్ జోంగ్ ఉన్ అభివర్ణించారు. ఆయన ప్రకటన అనంతరం ఈ ఆంక్షల అమలకు అధికారులు ఉపక్రమించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే యాత్ లీగ్ వీటిని ప్రచారం చేస్తోంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు సమావేశాలను నిర్వహించి, అత్యంత తీవ్రమైన సందర్భాల్లో నిబంధనల్ని ఉల్లంఘించినవారి పేరు, చిరునామాను లౌడ్స్పీకర్లలో ప్రచారం చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa