వేసవిని ఎదుర్కొనేలా అన్ని రాష్ట్రాలు సిద్దంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇదిలావుంటే ఫిబ్రవరిలోనే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ వేసవి చాలా హాట్‌గా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గతవారం రోజులుగా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 11 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలో 1877 తర్వాత ఈ ఫిబ్రవరిలోనే గరిష్ఠ సగటు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎమ్‌డీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సగటు ఉష్ణోగ్రత 29.54 డిగ్రీలుగా నమోదైందని, గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు పేర్కొంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వడగాడ్పుల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలపై మార్చి 1 నుంచి రోజువారీగా నిఘా ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్ర ప్రభుత్వాలకు మంగళవారం లేఖ రాశారు. ‘‘నేషనల్ ప్రోగ్రాం ఆన్ క్లైమేట్ ఛేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ కింద అన్ని జిల్లాల్లోనూ సమీకృత ఆరోగ్య సమాచార వేదిక ఏర్పాటుచేయాలి.. వడగాడ్పులకు గురైన వారి వివరాలు, మరణాలను నిబంధనల ప్రకారం రూపొందించాలి.
నేషనల్ ప్రోగ్రాం ఆన్ క్లైమేట్ ఛేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ జారీచేసే వడగాడ్పుల తీవ్రత వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి ఆసుపత్రులకు అందజేయాలి... వడగాడ్పుల వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర, జిల్లా, నగరస్థాయి వైద్యఆరోగ్య విభాగాలు ప్రణాళికలు రూపొందించి, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి.. వైద్యాధికారులు, వైద్యసిబ్బంది, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి వడగాడ్పుల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యల తీవ్రత గురించి అవగాహన కల్పించాలి. దీనిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, నివారణ చర్యలు తీసుకొనేలా చూడాలి.
ఇందుకు సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ రూపొందించిన శిక్షణ విధానాలను అనుసరించాలి. ఆసుపత్రుల్లో అత్యవసర ఔషధాలు, ఫ్లూయిడ్స్, ఐస్ ప్యాక్స్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అవసరమైన పరికరాలు, తాగునీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి’’ అని రాజేష్ భూషణ్ లేఖలో పేర్కొన్నారు.
వడగాల్పులకు గురయితే పెద్దల్లో అయోమయం, గందరగోళం, మతిస్థిమితం తప్పినట్లు వ్యవహరించడం, ఆందోళన, చికాకు, మూర్చ, కోమా, పొడిచర్మం, శరీర ఉష్ణోగ్రతలు 104 డిగ్రీల ఫారిన్ హైట్‌కు చేరడం, దడపుట్టించేలా తలనొప్పి, ఆందోళన, మైకం, తేలికపాటి తలనొప్పి, కండరాల్లో బలహీనత, తిమ్మిర్లు, వికారం, వాంతులు, గుండె స్పందనలో, శ్వాసలో వేగం పెరగడం
చేయకూడనవి
ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు రాకూడదు.
బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శ్రమతో కూడిన కార్యకలాపాలను నిలిపివేయడం
మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య పనులు ఆపేసి, ప్రయాణాల్లో నీళ్ల సీసా వెంట ఉంచుకోవాలి.
శరీరంలో నీటి పరిమాణాన్ని తగ్గించే మద్యం, టీ, కాఫీ, కార్బోనేటెడ్ శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.
ఆరు బయట నిలిపిన వాహనాల్లో పిల్లలు, పెంపుడు జంతువులను ఉంచొద్దు.
చేయాల్సినవి
వీలైనంత మేరకు ఒకవేళ దాహం లేకపోయి నీరు ఎక్కువగా తాగడం
లేత రంగు, తేలికపాటి, వదులైన వస్త్రాలు, ఖద్దరు దుస్తులు వేసుకోవడం
బయటకు వెళ్లాల్సి వస్తే కళ్లద్దాలు, గొడుగు లేదా టోపీ, షూ లేదా చెప్పులు తప్పనిసరి
ఒకవేళ ఎండలో పనిచేయాల్సి వస్తే తల, మెడ, ముఖం భాగాలను కప్పి ఉంచేలా రక్షణ చర్యలు తీసుకోవాలి.
అనారోగ్యం అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఓఆర్ఎస్, ఇంటిలో తయారుచేసే లస్సీ, గంజి, నిమ్మరసం, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది.
ఇంటిని చల్లగా ఉంచుకోవడం, కర్టెయిన్లు, షట్టర్లు, సన్‌షేడ్లతో పాటు రాత్రిపూట కిటికీలు తెరిచి ఉంచాలి.
పెంపుడు జంతువులకు అవసరమైన నీటిని అందించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa