ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ సమావేశంలో భారత్ పై తీవ్ర ఆరోపణలు చేసిన కైలాస ప్రతినిధులు

international |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2023, 08:23 PM

కైలాస దేశం అంటే మనకు గుర్తొచ్చేది వివాదాస్పద నిత్యానంద. ఆయన తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. భారత్ నుంచి పరారైన ఈయన నాలుగేళ్ల కిందట ‘కైలాస’ పేరుతో ఏకంగా ప్రత్యేక దేశాన్ని సృష్టించుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దేశం కోసం ప్రత్యేకంగా కరెన్సీని కూడా నిర్ణయించడం గమనార్హం. తాజాగా, తన దేశం తరఫున ఇద్దరు ప్రతినిధులను ఐక్యరాజ్య సమితి సమావేశాలకు నిత్యానంద పంపారు. కైలాస దేశ ప్రతినిధిగా హాజరైన ఓ మహిళ.. నిత్యానందను భారత ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించడం గమనార్హం.


ఫిబ్రవరి జెనీవాలో జరిగిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆమె.. తనను తాను విజయప్రియ నిత్యానందగా పరిచయం చేసుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘హిందువుల కోసం తొలి సార్వభౌమ దేశం ‘కైలాస’ ఏర్పాటుచేసిన నిత్యానంద హిందూ సంప్రదాయాలను, నాగరికతను పునరుద్ధరిస్తున్నారు.. ఆది శైవ దేశీయ వ్యవసాయ తెగలతో సహా హిందూమతంలో 10,000 సంప్రదాయాలు ఉన్నాయి’’ అని తెలిపారు. కైలాస తరఫున తాను ఐరాసలో శాశ్వత ప్రతినిధిగా నియమితులైనట్టు విజయప్రియ చెప్పడం గమనార్హం.


‘కైలాస దేశంలో పద్దతులు పురాతన హిందూ సంప్రదాయాలు, పరిష్కారాలతో పాటు ప్రస్తుత హిందూ సూత్రాలకు అనుగుణంగా ఉంటాయి.. ఇది స్థిరమైన అభివృద్ధితో చాలా విజయవంతమైంది.. హిందూ మతం సంప్రదాయాలు, జీవనశైలిని పునరుద్ధరించినందుకు కైలాస అత్యున్నత పీఠాధిపతి వేధింపులను ఎదుర్కొంటున్నారు.. మానవ హక్కుల ఉల్లంఘనకు గురయ్యారు.. అతను బోధనలపై నిషేధం కొనసాగుతోంది.. మాతృ దేశం నుంచి బహిష్కరింపబడ్డారు’అని విజయప్రియ అన్నారు. కైలాసానికి చెందిన రెండు మిలియన్ల హిందువులపై జరుగుతోన్న హింసను నిరోధించడానికి జాతీయంగా, అంతర్జాతీయంగా అమలవుతున్న చర్యలను తీసుకోవాలని ఐరాసను కోరారు. అనంతరం కైలాస నుంచే వచ్చిన మరో ప్రతినిధి ఈఎన్‌ కుమార్‌ సైతం మాట్లాడారు. తనను తాను చిన్న రైతుగా పరిచయం చేసుకున్నాడు. ఈ సందర్భంగా భారత్‌లోని చట్టాలు దేశీయ వ్యవసాయ పద్ధతులపై చాలా పరిమితులను ఎదుర్కొంటున్నాయని ధ్వజమెత్తారు.


అయితే, ఈ దేశాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించిందా? లేదా? అనేది ఇంకా స్పష్టత లేదు. అత్యాచారం, అపహరణ వంటి పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందపై భారత్‌లో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ సైతం జారీ అయింది. 2019లో దేశం నుంచి పారిపోయిన నిత్యానంద.. 2020లో ఈక్వెడార్‌ తీరానికి దగ్గర్లోని ఓ ద్వీపాన్ని తీసుకుని దానిని కైలాస దేశంగా ప్రకటించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa