బొలెరో వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన ఘటన జలుమూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో హీరమండలం నుండి జలుమూరు వైపు వస్తున్న బొలోరో వాహనం డ్రైవర్ మద్యం మద్యలో నడుపుతుండడంతో అదుపుతప్పింది. ఈ ఘటనలో రోడ్డుపై నుండి వెళుతున్న శ్రీముఖలింగం గ్రామానికి చెందిన వై ఎర్రమ్మ(56) కు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో సైకిల్ పై వెళుతున్న ఒకరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో వాహనం పక్కన ఉన్న పంట పొలాలలో బోల్తా కొట్టింది. ప్రమాదంలో గాయపడిన సైక్లిస్టును 108 వాహనంలో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై పారినాయుడు వివరాలు సేకరిస్తున్నారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ ఇద్దరు పరారు అవుతుండగా స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇంకా మరిన్ని వివరాలు అందవలసి ఉంది.