ఎస్సీ హాస్టల్ ఆవరణలో పేలుడు సంభవించడంతో మధుపాల్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన 10 రోజుల క్రితం జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరు పట్టణ శివారు పొట్టిపాడురోడ్డులోని ఎస్సీ బాలుర వసతి గృహంలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు గత నెల 24 రాత్రి 8.30 గంటల సమయంలో బయటి నుంచి తెల్లటి వైరు, బ్యాటరీ, లైట్ హాస్టల్ ఆవరణలోకి తీసుకొచ్చి, వైర్లతో లైట్ వెలిగించే ప్రయత్నంలో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన మధుపాల్ అనే విద్యార్థిని ప్రొద్దుటూరు ప్రభుత్వా సుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆ విద్యార్థికి సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. సంఘటనపై హాస్టల్ హెల్పర్ (కామాటి)గా పనిచేస్తున్న సంజీవ రాయుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు. పేలుడుకు కారణం ఏమిటన్నది నిర్ద్ధారించుకునేందుకు సంఘటన స్థలంలో లభించిన వాటిని ల్యాబ్‌కు పంపామని, గాయపడిన విద్యార్థి కోలుకున్నాక మరిన్ని వివరాలు తెలుస్తాయని ఎస్‌ఐ చెబుతున్నారు. కాగా, స్థానికంగా ఉన్న ఓ నేత పులివెందుల, వేంపల్లెల్లో మైనింగ్ పనులు చేస్తుంటాడని, అతను మైనింగ్‌కు ఉపయోగించే వాటిని హాస్టల్ సమీపంలో ఉంచేవాడని, అవే పేలుడుకు కారణమై ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయం తొక్కిపెట్టేందుకు పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి.