ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కాకాపుట్టిస్తున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వెేడెక్కాయి. ప్రస్తుతం ఉన్న బలాన్ని బట్టి ఏడు స్థానాలు దాదాపు వైఎస్సార్‌సీపీలో ఖాయమని భావిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధులు పోతుల సునీత, మర్రి రాజశేఖర్, వివి సూర్యనారాయణ రాజు పెన్మత్స, కోలా గురువులు, బొమ్మి ఇజ్రాయెల్, జయమంగళ వెంకటరమణ, చంద్రగిరి ఏసురత్నంలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా బీఫారంలు అందుకున్నారు. ఈనెల 13తో నామినేషన్ల గడువు ముగియనుండటంతో
ఇదిలా ఉంటే వైఎస్సార్‌సీపీపై పోటీకి సై అంటోంది టీడీపీ. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోందట. పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలని పార్టీ ముఖ్యనేతలతో అధినేత చంద్రబాబు చర్చిస్తున్నట్లు సమాచారం అందుతోంది. చంద్రబాబు టీడీపీ అభ్యర్థి నిలిపే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో స్థానంలో అభ్యర్థి విజయం సాధించాలంటే.. 22 నుంచి 23 ఓట్లు అవసరం.
టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే.. వారిలో నలుగురు టీడీపీకి దూరంగా.. వైఎస్సార్‌సీపీకి జై కొట్టారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి అధికార పార్టీకి మద్దతు తెలిపారు. దీంతో టీడీపీకి 19మంది బలం మాత్రమే ఉందని చెప్పాలి. ఒకవేళ టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపితే.. విప్ జారీ చేయాలని టీడీపీ భావిస్తోంది. అప్పుడు విప్‌కు అనుగుణంగా ఓటు వేయాల్సి వస్తుంది.. ఒకవేళ విప్‌ను ఉల్లంఘిస్తే ఎమ్మెల్యేలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చని టీడీపీ భావిస్తోందట. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడంపై టీడీపీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.