వైసీపీ సర్కార్ తో తలపడేందుకు ఉద్యోగులు నిర్ణయం తీసుకొంటున్నారు. ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని.. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ఉద్యోగుల డబ్బును ఇతర అవసరాలకు వాడుకుందని, నెలాఖరు లోపు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతుందని వివరించారు. కానీ.. డీఏ, ఏరియర్స్ ఎంతో లెక్కలు లేవని ఆరోపించారు. ఉద్యమ కార్యాచరణలోకి వెళ్లిన వారిని మభ్యపెట్టలేరని బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
'పీఆర్సీ ఒప్పందాలను పూర్తిగా అమలు చేయాలి. పీఆర్సీ పేస్కేల్ గురించి స్పష్టత ఇవ్వలేదు. స్పష్టత లేకుండా మొక్కుబడిగా చర్చలకు పిలిచారు. రిటైర్ అయిన వారికి బెన్ఫిట్స్ అందని పరిస్థితి ఉంది. వేతనాలు ప్రతినెలా ఒకటో తారీఖున ఇవ్వాలని కోరాం. ప్రభుత్వం మాత్రం ఇవ్వలేమని.. సాధ్యపడదని అంటోంది' అని బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు.
'సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి రూ.2,600 కోట్లు చెల్లించలేదు. సీపీఎస్ రద్దు మినహా.. మరే ప్రత్యామ్నాయం తమకు అక్కర్లేదు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ గురించి పట్టించుకోవడం లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను మోసం చేశారు. ప్రభుత్వం మొక్కుబడిగా హామీలు ఇస్తుంది. అందుకే మా కార్యాచరణ అమలుకు తీర్మానించాం' అని బొప్పరాజు ప్రకటించారు.