శ్రీశైలం- హైదరాబాద్ ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. శ్రీశైలం ఘాటు రోడ్డు అంటేనే భారీగా మలుపు, ప్రమాదకరమైన లోయలు ఉంటాయి.
అయితే, డ్యామ్ సైట్ పాయింట్ దగ్గర ఉన్న పెద్ద టర్నింగ్ వద్ద అదుపు తప్పిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఆఎస్ ఆర్టీసీ)కు చెందిన టీఎస్ 09 జెడ్ 7822 నంబర్ కలిగిన బస్సు.. ఒక్కసారిగా గుంతలో ఇరుక్కుపోయి ఆగిపోయింది. బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతంలో.. మరో 10 అడుగుల దూరంలో భారీ లోయ ఉండడంతో.. దీన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలావుంటే గత నెలలో కూడా ఇదే ప్రాంతంలో మహబూబ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. ఇక, ఘాట్ రోడ్డులో ప్రమాదం జరగంతో.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా సేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే, ఈ బస్సు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.