ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అనూహ్యంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైసీపీ నేతలు వరుసగా పార్టీకి గుడ్‌బై చెబుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటికి మొన్న మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వైసీపీకి రాజీనామా చేయగా.. ఆదివారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తాజాగా, మరో వైసీపీ నేత జనసేన పార్టీ సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది.
జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం బీసీ సదస్సు నిర్వహించారు. అయితే, ఆ సదస్సులో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల పాల్గొన్నారు. అయితే, సడన్‌గా ఆమె జనసేన పార్టీ సమావేశానికి రావడం హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే కాండ్రు కమల జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
జనసేన బీసీ సమావేశంలో పాల్గొన్న కాండ్రు కమల.. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలన్నీ బీసీల ఓట్లు కావాలని అంటున్నాయని.. కానీ, ఎమ్మెల్యే సీట్ల వరకు వచ్చేసరికి వెన్ను చూపిస్తున్నాయని మండిపడ్డారు. బీసీలు బలంగా ఉన్న మంగళగిరి వంటి చోట్ల కూడా ఓసీలే పోటీ చేస్తున్నారని విమర్శించారు. నిధులు, విధులు లేని స్థానిక సంస్థల్లో బీసీలకు, మహిళలకు పదవులు ఇచ్చేసి.. తమకు ఏదో రాజ్యాధికారం ఇచ్చేశామని గొప్పులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే మంగళగిరిలో బలంగా ఉన్న పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కాండ్రు కమల.. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. గతంలో మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్‌గా, ఎమ్మెల్యేగా పని చేశారు. ఏపీ విభజన తర్వాత కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె.. ఆ తర్వాత టీడీపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే అధిష్టానం మంగళగిరి సీటును నారా లోకేష్‌కు కేటాయించడంతో.. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. కానీ, ఇప్పుడు జనసేన బీసీ సదస్సుకు ఆమె హాజరుకావడం.. బీసీలకు జరుగుతోన్న అన్యాయంపై గొంతు ఎత్తడం హాట్ టాపిక్‌గా మారింది.