రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు, అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీఅధినేత నారా చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నేతలతో పలుచోట్ల ఎన్నికల అధికారులు కుమ్మక్కయ్యారని.. బోగస్ ఓట్లు భారీగా నమోదయ్యాయని చంద్రబాబు ఆరోపించారు. పలు ప్రాంతాల్లో వెలుగులోకి బోగస్ ఓట్ల వివరాలను.. తన లేఖలో ప్రస్తావించారు. 'ఒకవైపు బోగస్ ఓట్లు.. మరో వైపు ఓట్ల కొనుగోలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతో ఇదీ వైసీపీ ఎంచుకున్న విధానం! ఓటర్లు చైతన్యంతో వ్యవహరించి వైసీపీకి బుద్ది చెప్పాలని కోరుతున్నా' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
నకిలీ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చడం వల్ల.. ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతోందని.. చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కూడా బోగస్ ఓట్ల తంతు నడిచిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే పునరావృతం అవుతోందని.. డిగ్రీ చదవని వారు నకిలీ సర్టిఫికెట్లతో ఓటర్లుగా నమోదయ్యారని ఆరోపణలు చేశారు. తప్పుడు చిరునామాలతో పెద్ద సంఖ్యలో ఓటర్లను చేర్చారని.. తిరుపతిలో ఒకే ఇంటి చిరునామాతో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు చేర్చారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.