భారతదేశంలో అందగత్తేలు ఎక్కువ అని ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. ఏటా నిర్వహించే ప్రపంచ సుందరి, విశ్వ సుందరి పోటీల్లో ఏదో ఓ దేశానికి చెందిన అమ్మాయిలు విజేతగా నిలుస్తారు. ఇలా ఒకరిద్దరి గురించి కాకుండా.. సగటున ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలు భారతీయులేనని ఓ నివేదిక వెల్లడించింది. మొత్తంగా చూసినా మనమే టాప్‌లో నిలవడం విశేషం. యూకేకు చెందిన మల్టీనేషనల్ వస్త్రాల కంపెనీ ‘పోర్ మోయి’ ఆన్‌లైన్‌లో అధ్యయనం నిర్వహించి, కృత్రిమ మేధస్సు సాయంతో విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది. ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘రెడ్డిట్’లో గత ఏడాది మహిళలు, పురుషుల అందానికి సంబంధించి వచ్చిన లక్షలాది పోస్టులను పోర్ మోయి సంస్థ కృత్రిమ మేధ ఆధారంగా విశ్లేషించింది.
వివిధ దేశాలకు చెందిన మహిళలు, పురుషుల ఫోటోలతో కూడిన పోస్టులు, వాటిలోని ‘అట్రాక్టివ్, బ్యూటిఫుల్, హ్యాండ్‌సమ్, ప్రెట్టీ, గుడ్ లుకింగ్, గార్జియస్, ప్రెట్టీ..’వంటి కామెంట్లు. ఆ పోస్టులు, ఫోటోలను వచ్చిన యాప్ ఓట్లను (ఫేస్‌బుక్‌లో లైక్‌ల తరహావి) పరిగణనలోకి తీసుకుంది. వీటి ఆధారంగా ఆయా దేశాల్లోని వారికి ర్యాంకులను ఇచ్చింది. కృత్రిమ మేధ ఇమేజ్ జనరేషన్ టూల్ ‘మిడ్‌జర్నీ’సాయంతో 50 దేశాల మహిళలు, పురుషుల రూపురేఖలపై రూపొందించిన ఫోటోలను కూడా విడుదల చేసింది.
50 దేశాలలో నిర్వహించిన ‘పోర్ మోయి’అధ్యయనంలో ప్రపంచంలోనే అత్యంత అందగత్తెలుగా భారతీయ మహిళలు నిలిచారు. ఈ జాబితాలో వరుసగా జపాన్, స్వీడన్, పోలాండ్, ఇటలీ, బ్రెజిల్, ఉక్రెయిన్, ఫ్రాన్స్, ఇజ్రాయేల్, అమెరికా మహిళలు ఉన్నారు. మొత్తంగా మహిళలు, పురుషులు కలిపి చూస్తే కూడా.. భారతీయులే ముందు వరుసలో ఉండటం గమనార్హం. తర్వాతి స్థానాల్లో అమెరికా, స్వీడన్, జపాన్, కెనడా, బ్రెజిల్ వాసులు ఉన్నారు. అలాగే, పొరుగుదేశాలు చైనా 16, పాకిస్తాన్ 23 స్థానాల్లో నిలిచాయి.
పురుషుల కేటగిరీ బ్రిటిష్ పౌరులు ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయైనవారిగా మొదటిస్థానంలో.. భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో ఇటలీ, యూఎస్‌ఏ, స్వీడన్, జపాన్, ఫ్రాన్స్, ఐర్లాండ్, బెల్జియం, బ్రెజిల్ వారు ఉన్నారు. ఇదిలావుంటే 13 ఏళ్ల కిందట ‘ఒన్‌పోల్’ అనే సంస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా అందమైనవారు ఎవరు? అనే అధ్యయనం నిర్వహించింది. ఇదే సర్వే ఆధారంగా జరిగింది. ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలు ఏ దేశ ప్రజల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారో ఇందులో తేలింది. ఇందులోనూ భారత్ టాప్ 10లో ఉండగా.. అమెరికా ప్రజలను అత్యంత ఆకర్షణీయంగా పరిగణించారు. బ్రెజిల్ రెండో స్థానంలో, స్పెయిన్ మూడో స్థానంలో నిలిచాయి. ఈ అధ్యయనంలో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.