మనదేశానికి ప్రస్తుతం సరికొత్త వైరస్ వెంటాడుతోంది. దేశంలో ప్రస్తుతం ఇన్‌ఫ్లుయెంజా ఏ ఉపవర్గం హెచ్3ఎన్2 ఇన్‌ఫెక్షన్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం ఆయన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేష్‌భూషణ్ శనివారం లేఖ రాశారు. ప్రస్తుత సీజన్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితుల వల్ల సీజనల్‌గా వచ్చే ఇన్‌ఫ్లుయెంజా వ్యాప్తి తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. ఇన్‌ఫ్లుయెంజా, కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లోని పరిస్థితులను సమీక్షించి ఔషధాలు, వైద్యపరికరాలు, మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని సూచించారు.
‘‘ఇన్‌ఫ్లుయెంజా ఏటా సీజనల్‌గా వస్తుంది.. ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు.. ప్రజల జీవనశైలిలో మార్పులు ( జాగ్రత్తలు తీసుకోకుండా ఎదుటివారికి సమీపంలో తుమ్మడం, దగ్గడం, ఇరుకు ప్రదేశాల్లో ఎక్కువ మంది గుమికూడటం), మరోవైపు ఇన్‌ఫ్లుయెంజా ఏ (హెచ్ఎ1న్1, హెచ్3ఎన్2), ఎడినోవైరస్‌లు వేగంగా వ్యాప్తిచెందడానికి వాతావరణం అనుకూలంగా మారింది.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయెంజా లైక్ ఇల్‌నెస్ లేదా సీవియర్ యక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ తీవ్రత పెరుగుతూ వస్తోంది.
డిసెంబరు ద్వితీయార్ధం నుంచి హెచ్3ఎన్2 ప్రభావం పెరగుతోంది... చిన్నారులు, వయోవృద్ధులు, బీపీ, మధుమేహం లాంటి సమస్యలు ఉన్న వారికి హెచ్1ఎన్1, హెచ్3ఎన్2, అడినోవైరస్‌లు సోకే ప్రమాదం ఎక్కువ.. దేశవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టినా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పాజిటివిటీ రేటు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. దీన్ని వెంటనే నియంత్రించాలి.. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ వ్యాప్తిపై నిఘా ఉంచడంతోపాటు టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్, కొవిడ్ నియంత్రణకు అవసరమైన నిబంధనలను పాటించాలి..
ఈ ఏడాది జనవరి 1 నుంచి ఐసీఎంఆర్, వీఆర్డీఎల్ నెట్‌వర్క్ ల్యాబ్ ద్వారా సేకరించి పరీక్షించిన నమూనాల్లో 25.4% మేర అడినో వైరస్ పాజిటివ్ వచ్చింది. దీనివల్ల శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తోపాటు జ్వరం, దగ్గు లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.. ముఖ్యంగా వృద్ధులు, మధుమేహం, గుండె, కిడ్నీ, లివర్ వంటి దీర్ఘకాలిక సమస్యలున్నవారు, గర్భిణులు ఎక్కువ అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి.. వీటిపై ప్రజల్లో అవగాహన కలిగించి.. సూచనలు చేయాలి..
చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, దగ్గు, తుమ్ము, చీదేటప్పుడు మొహానికి చేతులు లేదా టిష్యూనో అడ్డుగాపెట్టుకోవడం.. బహిరంగ ప్రాంతాల్లో ఉమ్మొద్దని చెప్పాలి. మాస్కులు ధరించడం, తరచూ చేతులు శుభ్రపరచుకోవడాన్ని ప్రోత్సహించాలి.. అన్ని రాష్ట్రాలూ ఐఎల్‌ఐ వ్యాప్తిని పరిశీలించాలి.. ఇన్‌ఫ్లుయెంజా, కోవిడ్, అడినో వైరస్‌లను గుర్తించేందుకు సాధ్యమైనన్ని ఎక్కువ నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపాలి.. ఆసుపత్రుల్లోని పరిస్థితులను సమీక్షించి ఔషధాలు, వైద్యపరికరాలు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలి.. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేలా మానవ వనరులకూ తగిన శిక్షణ ఇప్పించాలి’’ అని రాజేష్ భూషణ్ ఈ లేఖలో రాష్ట్రాలకు సూచించారు.