కాలం మారుతోంది. పెళ్లి విషయంలో అమ్మాయిలు సైతం నిర్బయంగా నిర్ణయం తీసుకొంటున్నారు. ఇదిలావుంటే కళ్యాణవేదికపై వధూ వరులు కూర్చుని ఉండగా.. పెళ్లికి వచ్చిన బంధు మిత్రులు అతిథులతో సందండిగా ఉంది. పురోహితుడు వేదమంత్రాలతో పెళ్లి జరిపిస్తున్నాడు కానీ, శాస్త్రోక్తంగా ఆయన చెప్పే మాటలను వరుడు (Groom) వినే పరిస్థితిలో లేడు. ఫుల్లుగా మద్యం సేవించిన అతడు.. మండపానికి వచ్చినప్పటి నుంచే విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. మద్యం మత్తులో కారులోంచి తూలుతూ దిగిన పెళ్లి కొడుకు.. పెళ్లిపీటలపైనే నిద్రపోయాడు. అతడి తీరుతో వధువుకు చిర్రెత్తుకొచ్చి పెళ్లిపీటల మీద నుంచి లేచి వెళ్లిపోయింది. విస్తుగొలిపే ఈ ఘటన అసోంలోని నల్‌బరి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నల్‌బరి పట్టణానికి చెందిన ప్రసేన్‌జీత్ హలోయ్ అనే యువకుడికి ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ వివాహానికి కుటుంబసభ్యులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఊరేగింపుగా కళ్యాణ వేదికకు వరుడు.. ఫుల్లుగా మద్యం సేవించి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న వరుడిని చూసి వధువు పెళ్లికి నిరాకరించింది. అతడే కాదు, వరుడి తండ్రి సహా అతడి తరఫు వచ్చిన వారిలో 95 శాతం మంది బంధువులది ఇదే పరిస్థితి. అయితే, కుటుంబసభ్యులు తమ కుమార్తెను ఒప్పించడంతో ఆమె పెళ్లి పీటలపై కూర్చుంది.
వరుడు మద్యం మత్తులో తూగుతూనే ఆమె పక్కన కూర్చున్నాడు. పురోహితుడు చెప్పే మాటలను కూడా వినే పరిస్థితుల్లో లేని అతడు.. పెళ్లిపీటలపైనే నిద్రపోయాడు. పెద్దలు చెప్పడంతో అప్పటి వరకూ సహనంతో ఉన్న వధువు.. అతడి తీరుతో విసిగిపోయింది. దీంతో కోపంతో పెళ్లిపీటల నుంచి లేచి వెళ్లిపోయింది. ఇలాంటి వాడ్ని పెళ్లిచేసుకుంటే తన భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్ధమైపోయిందని వధువు వ్యాఖ్యానించింది.
‘‘పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది.. శాస్త్రోక్తంగా పండితుడు అన్ని చేయిస్తున్నాడు.. వివాహం కోసం మా కుటుంబం వీలైనంత మేర భారీ ఏర్పాట్లు చేసింది.. కానీ, వరుడి ప్రవర్తనకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వధువు పెళ్లిపీటల మీద నుంచి దిగిపోయింది.. దీంతో అక్కడ గందరగోళం నెలకుంది... ’’ అని వధువు బంధువు ఒకరు తెలిపారు. పెళ్లి కొడుకు ప్రవర్తనపై వధువు తరఫు బంధువులు గ్రామపెద్దలను ఆశ్రయించారు. అలాగే, నల్‌బరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు పరిహారం చెల్లించాలంటూ వరుడి కుటుంబాన్ని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.