ట్రాక్టర్ - ద్విచక్ర వాహన దారుణ్ణి ఢీ కొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు భట్టిప్రోలు ఎస్. ఐ, వై. సురేష్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం భట్టిప్రోలు అద్దేపల్లి ఇందిరా కాలనీకి చెందిన పినగాల విమల్ రాజు (24) తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఆదివారం చావలి బస్టాండ్ వైపు నుంచి తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ క్రమంలో 108 సహాయంతో భట్టిప్రోలు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధమ చికిత్స చేయించి, మెరుగైన చికిత్స నిమిత్తం తెనాలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విమల్ రాజు మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుని తండ్రి ఆనందరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. సోమవారం తెనాలి ఏరియా వైద్యశాలలో శవపంచనామా అనంతరం పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు.