ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ కరోనా కేసుల్లో పెరుగుదల,,,ఆరు వారాల నుంచి స్థిరంగా నమోదవుతున్న కేసులు

national |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2023, 08:15 PM

మన దేశంలో ఇన్‌ప్లూయెంజా ఏ రకం వైరస్ కేసులు నమోదు ఆందోళనకలిగిస్తోంది. ఇదే సమయంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 పాజిటివిటీ రేటు పెరుగుతూ ఉంది. దేశంలో 114 రోజుల తర్వాత శనివారం మొదటిసారి రోజువారీ కేసులు 500 దాటాయి. శనివారం దేశవ్యాప్తంగా 524 కేసులు నమోదు కాగా.. చివరి సారిగా గతేడాది నవంబరు 18 ఈ సంఖ్యలో నమోదయ్యింది. అలాగే, గత 11 రోజుల్లో వారం సగటు కేసులు రెట్టింపయ్యాయి. మొత్తంగా చూసుకుంటే రోజువారీ కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. మరణాలు కూడా స్వల్పంగానే ఉన్నాయి. గత వారం రోజుల్లో కరోనాతో ఆరుగురు చనిపోయారు.


గతవారం దేశవ్యాప్తంగా 2,671 కొత్త కేసులు నమోదు కాగా.. అంతకు ముందు వారం నమోదైన 1803 కేసులతో పోల్చితే 50 శాతం అధికం. గతేడాది జూన్-జులై తర్వాత దేశంలో కరోనా కేసులు పెరుగుదల గత నాలుగు వారాల నుంచి స్థిరంగా కొనసాగుతోంది. మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాల్లోనే కొత్త కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. గత వారం రోజుల్లో కర్ణాటక (584), కేరళ (530), మహారాష్ట్ర (512)లో 500కిపైగా కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు కొన్ని రాష్ట్రాల్లో 100కిపైగా కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో ఇన్‌ఫెక్షన్ అత్యధికంగా నమోదయ్యింది. ఫిబ్రవరి 26-మార్చి 4తో ముగిసిన ముందువారం 48 కేసులు నమోదుకాగా.. గతవారం (మార్చి 5-11) ఏకంగా 190 మంది వైరస్ బారినపడ్డారు. ఈ సమయంలో మహారాష్ట్ర 87 శాతం, తమిళనాడు 67 శాతం (224), తెలంగాణ 63 శాతం (197) పెరుగుదల కనిపించింది.


మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో కేసులు పెరుగుతూ ఉన్నా.. వారం వారీగా చూస్తే 100లోపు ఉన్నాయి. ఢిల్లీ గతవారం 97 కేసులు బయటపడ్డాయి. అంతకు ముందు వారం ఇవి 72గా ఉన్నాయి. ఇక, దేశంలో గత 11 రోజుల్లో కేసులు రెట్టింపయ్యాయి. ఫిబ్రవరి 28న 193గా ఉన్న కేసులు.. మార్చి 11 నాటికి 383కి చేరాయి. మార్చి నెల ప్రారంభంలో డబ్లింగ్ రేటు 16 శాతానికి దగ్గరగా ఉండటం ఇటీవల రోజుల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయనడానికి సంకేతం. వారం వారీ కరోనా మరణాలు 10లోపు ఉన్నాయి. గత రెండు వారాలుగా సగటున ఆరుగురు చొప్పున కరోనాతో చనిపోయారు.


ఇక, ఫిబ్రవరి 19- 25తో ముగిసిన వారం 1,163 కేసులు, అంతకు ముందు 839 కేసులను గుర్తించారు. ఈ సంఖ్య అంత పెద్దదేమీ కాదు కానీ, స్థిరంగా కేసుల పెరుగుదల ఆందోళనకర అంశమే. వాస్తవానికి వరుసగా ఆరు వారాల నుంచి కేసులు పెరుగుతున్నాయి. మొదటి రెండు వారాలు ఉపాంత పెరుగుదల ఉంది. గత ఏడాది జూలై తర్వాత ఇదే అత్యధిక పెరుగుదల. దేశంలో చివరిసారిగా గతేడాది జులై 18-25 వారం వీక్లీ ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 1.4 లక్షలు. అప్పటి నుంచి కోవిడ్ కేసులు రెండు వారాల కంటే ఎక్కువ కాలం ఉండే మూడు స్వల్ప కాలాలు మినహా క్రమంగా తగ్గుతున్నాయి. జనవరి 23-29లో వారం వారీ కేసులు 707కి చేరుకున్నాయి.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com