ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతీయ కుటుంబ వ్యవస్థకు విరుద్దం...గే వివాహాలపై సుప్రీం కోర్టుుకు తెలియజేసిన కేంద్రం

national |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2023, 08:17 PM

స్వలింగ వివాహాలకు చటబద్దతపై కేంద్రం స్పందిస్తూ ఇలాంటి వివాహాలు భారతీయ సంప్రదాయలకు విరుద్దమని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు తన అభిప్రాయాన్ని తెలియజెప్పింది. స్వలింగ వివాహాలు భారతీయ కుటుంబ వ్యవస్థకు విరుద్ధమని, వాటికి చట్టబద్ధత కల్పిస్తే వ్యక్తిగత చట్టాలు, సామాజిక విలువల సున్నిత సమతౌల్యత పూర్తిగా దెబ్బతింటుందని ఈ మేరకు కేంద్రం అఫిడవిట్‌ సమర్పించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్వలింగ సంపర్కుల సహజీవనం, వారి మధ్య లైంగిక సంబంధాలు నేరం కాకపోయినప్పటికీ, ఆ తరహా వివాహాలను అధికారికంగా గుర్తించాలని పిటిషనర్లు కోరజాలరని అఫిడవిట్‌లో పేర్కొంది.


ప్రతి మతం, సంప్రదాయం వేర్వేరు లింగాల మధ్య జరిగే వివాహాలనే గుర్తించారని తెలిపింది. దేశంలోని ఆయా మతాల వారీగా వివాహ చట్టాల్లో కొన్ని నిబంధనలు ఉన్నాయని గుర్తుచేసింది. ఒకవేళ, స్వలింగ వివాహాలను గుర్తిస్తే.. వాటిని తమకు అనుకూలంగా మార్చుకుని, నిబంధనలను ఉల్లంఘించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. స్త్రీ, పురుషులను ఒక్కటి చేయడమే వివాహం పరమార్థమని, సామాజికంగా, సాంస్కృతికంగా, చట్టపరంగానూ ఇదే విశ్వాసం ఉందని చెప్పింది.


కానీ, ఒకే లింగానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోవడం, దానికి చట్టబద్ధత కల్పించి ప్రజల నమ్మకానికి, ఆచార వ్యవహారాలకు భంగం కలిగించకూడదని కేంద్రం తెలిపింది. స్వలింగ వివాహాలను గుర్తిస్తే కుటుంబ సమస్యలు కూడా ఎక్కువవుతాయని తెలిపింది. అయితే, తాము సాధారణ వివాహాలనే గుర్తించినప్పటికీ.. వాటికి భిన్నంగా చేసుకునే వివాహాలు, వ్యక్తిగత సంబంధాలు చట్టవిరుద్ధమైనవేమీ కావని వివరించింది.


స్త్రీ, పురుషుడు మహిళ మధ్య వివాహం వ్యక్తిగత చట్టాలు లేదా క్రోడీకరించబడిన చట్టాలు హిందూ వివాహ చట్టం, 1955, క్రిస్టియన్ వివాహ చట్టం, 1872, పార్సీ వివాహం- విడాకుల చట్టం 1936 లేదా ప్రత్యేక చట్టం 1954, విదేశీ వివాహ చట్టం 1969 ప్రకారం జరుగుతుందని కేంద్రం తెలిపింది. భారత్ చట్టబద్ధమైన, వ్యక్తిగత చట్ట పాలనలో వివాహం శాసనపరమైన అవగాహన చాలా నిర్దిష్టంగా ఉంటుంది... అంటే పురుషుడు, స్త్రీ మధ్య వివాహం మాత్రమే’ అని పేర్కొంది.


ఇదిలావుంటే స్వలింగ వివాహాలకు సంబంధించి వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు జనవరి 6న క్లబ్ చేసి విచారణ చేపట్టాలని నిర్ణయించింది. కేంద్రం తరఫున వాదిస్తున్న న్యాయవాది, పిటిషనర్ల తరఫు న్యాయవాది అరుంధతీ కట్జూ కలిసి లిఖితపూర్వక పత్రాలు, పూర్వాపరాల సాధారణ సంకలనాన్ని సిద్ధం చేయాలని.. విచారణ సమయంలో వాటిని తమ ముందు ఉంచాలని పేర్కొంది. స్వలింగ వివాహాలను గుర్తించేలా ఆదేశాలివ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను బదిలీ చేయాలంటూ గత ఏడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది.


అటు, స్వలింగ వివాహాలకు చట్టబద్దతను కేంద్రం వ్యతిరేకిస్తున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొనడాన్ని ఎల్జీబీటీ సంఘాలు ఖండించాయి. భారత్‌లో బహుళత్వం, భిన్నత్వం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ భిన్న లింగాలకు మాత్రమే వివాహ హక్కు ఉంటుందని భావించడం శోచనీయమని మండిపడ్డాయి. భిన్నత్వంలో ఏకత్వం గురించి పాఠశాల స్థాయి నుంచే బోధిస్తుంటారని, కానీ వివాహాల విషయంలో మైనార్టీలైన స్వలింగ సంపర్కులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com