ఇతరులకు భిన్నంగా ఉండేలా పెళ్లి వేడుకలో ఎద్దుల పోటీ నిర్వహించి వధూవరులతో పాటు అతిథులను ఆశ్చర్యానికి గురిచేసిన ఘటన గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా చలాలా గ్రామంలో చోటుచేసుకుంది. కళ్యాణ మండపంలోకి వచ్చి రెండు ఎద్దులు సుమారు 30 నిమిషాలపాటు కొట్లాడుకున్నాయి. దీంతో అరగంట సేపు పెళ్లి క్రతువు ఆగిపోయింది. అందరూ మండపం దిగి వాటికి దూరంగా సురక్షిత ప్రదేశానికి వెళ్లారు. ఈ దృశ్యాన్ని పెళ్లికి వచ్చిన వారు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. చివరకు ఎద్దులు శాంతించి వెనుదిరగడంతో తిరిగి పెళ్లి క్రతువు ప్రారంభమైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
అనంతరం మండపాన్ని మళ్లీ అలంకరించడంతో నవ దంపతులిద్దరూ శాస్త్రోక్తంగా ఒక్కటయ్యారు. ఈ ఎద్దుల పోరాటానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతనెలలో ఊరేగింపులో ఖరీదైన కార్లును వినియోగించి, వరుడు మాత్రం సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఎద్దుల బండిపై కళ్యాణవేదికకు చేరుకున్న ఘటన కూడా గుజరాత్‌లో చోటుచేసుకుంది. అటు ఆధునికత, ఇటు సంప్రదాయం ఒకేసారి కలగలిసి వరుడు సామాన్యుడిలా మండపానికి చేరుకున్నాడు బీజేపీ నేత కుమారుడు.
ఇదే విధంగా మరో వరుడు ఏనుగు అంబారీ ఎక్కి.. కరెన్సీ నోట్లు వెదజల్లుతూ కత్తిపట్టుకుని చిందులేశాడు. ఓవైపు లగ్జరీ కార్లు కూడా ఈ ఊరేగింపులో మరో ఆకర్షణగా నిలిచాయి భావ్‌నగర్ జిల్లాకు చెందిన రమేశ్ భగవాన్భాయ్ హౌలియా కుమారుడు కుల్దీప్‌కి.. గర్దా ప్రాంతానికి చెందిన వైశాలి అనే యువతితో వివాహం జరిగింది. ఫిబ్రవరి 23న జరిగిన ఈ పెళ్లి గురించి చుట్టుపక్కల ప్రాంతాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వివాహానికి ముందు వధువు ఇంటికి ఊరేగింపుగా వెళ్లిన కుల్దీప్ ఏనుగు అంబారీ ఎక్కాడు.