ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొరుగు రాష్ట్రాల్లో కూడా టీడీపీ హవా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 01:05 PM

 అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఒక కీలకమైన పదవి తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఈ దీవుల ప్రధాన కేంద్రమైన పోర్ట్‌ బ్లెయిర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైౖర్మన్‌ పదవి టీడీపీకి చెందిన మహిళా కార్పొరేటర్‌ సెల్విని వరించింది. బీజేపీ, టీడీపీ కూటమి ఒప్పందంలో భాగంగా ఈ పదవి ఆమెకు దక్కింది. మూడేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాలేదు. బీజేపీ, టీడీపీ కలిసి కార్పొరేషన్‌ను దక్కించుకొన్నాయి. ఒప్పందం ప్రకారం మొదటి మూడేళ్లూ బీజేపీకి చైర్మన్‌ పదవి లభించింది. తర్వాతి రెండేళ్లు టీడీపీకి ఇచ్చారు. అక్కడ గెలిచిన టీడీపీ ఇద్దరు కార్పొరేటర్లకు చెరొక ఏడాది చైర్మన్‌ పదవి ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది. మహిళా కార్పొరేటర్‌ సెల్వికి మొదటి అవకాశం వచ్చింది. ఆమె గతంలో ఉప చైర్మన్‌గా పనిచేశారు. మంగళవారం జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్థికి 14 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థికి పది ఓట్లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల బయట టీడీపీకి ఇంత కీలకమైన పదవి లభించడం ఇదే ప్రథమం. అండమాన్‌ దీవులకు టీడీపీ అధ్యక్షునిగా ఉన్న మాణిక్యాలరావు యాదవ్‌, పార్టీ ఇన్‌చార్జి మాధవ నాయుడు అక్కడి బీజేపీ నేతలతో చర్చించి ఈ ఎన్నిక సాఫీగా జరిగేలా చూశారు. కాగా, పోర్ట్‌ బ్లెయిర్‌ ఎన్నికలో బీజేపీ, టీడీపీ కూటమి విజయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన దీనిపై ఒక ట్వీట్‌ చేశారు. ‘పోర్ట్‌ బ్లెయిర్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌ ఎన్నికలో స్ఫూర్తిదాయక విజయం సాధించిన కూటమికి అభినందనలు. పోర్ట్‌ బ్లెయిర్‌ ప్రజల కోసం మీరు పడిన శ్రమ, చూపించిన అంకిత భావం ఫలించాయి. ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పాలన, దూరదృష్టిపై ఉన్న నమ్మకానికి ఈ ఎన్నిక ఒక గుర్తింపు’ అని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa