ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలను నమ్మించి మోసం చేశాయని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా కన్వీనర్ వేమూరి సుధీర్ మాదిగ అన్నారు. మాదిగల సంగ్రామ పాదయాత్రలో భాగంగా గురువారం తుళ్ళూరు మండలానికి చేరుకున్నారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తానన్న బిజెపి ఈ దేశాన్ని 9 సంవత్సరాల నుంచి పరిపాలిస్తూ వర్గీకరణ చేయకుండా మాదిగల ను నమ్మించి మోసం చేసిందన్నారు. 28 సంవత్సరాలు ఉద్యమ చరిత్రలో బిజెపి నాయకత్వం మొత్తం కూడా వర్గీకరణ సిద్ధాంతాలు కట్టుబడి ఉండి వర్గీకరణ చేయకుండా చివరకు మాదిగలను అణిచివేసి కుట్రలు చేస్తుందన్నారు.