వైసీపీ పతనం మొదలైందని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవి విజయం వైపు దూసుకుపోతుండడంపై ఆయన ఈ వాఖ్యలు చేశారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఫలితాలు ప్రభుత్వానికి చెంపదెబ్బలాంటిదని వ్యాఖ్యానించారు. తాము ఎప్పటి నుంచో చెబుతున్నట్టు. వైసీపీ వైఫల్యాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయన్నారు. సరైన సమయంలో సరైన విజయం తమ పార్టీ అభ్యర్థులు సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగిస్తామని, వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అఖండ విజయం చేకూర్చిన ఉత్తరాంధ్ర పట్టభద్రులకు గంటా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.