పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు వైకాపా పార్టీకి శరాఘాతమని, ప్రభుత్వం పట్ల విద్యావంతుల్లో ఉన్న వ్యతిరేకతకు ఇది ఒక సంకేతమని మాజీ రాజ్యసభ సభ్యులు, ఏపిసిసి మీడియా ఛైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. శనివారం వేంపల్లెలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ పిఆర్సి సకాలంలో అమలు చేస్తాం, సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని ఉద్యోగులను నమ్మించి మోసగించిన ఫలితమే ఈ ఘోర పరాజయమన్నారు.
ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించిన పర్యవసానమే ఈ ఓటమి అన్నారు. వైకాపా పట్ల అన్ని ప్రాంతాల్లో, అన్ని వర్గాలల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి బైటపడిందన్నారు. డబ్బులు, వెండి నాణెల పంపిణీ లాంటి ప్రలోభాలు, దౌర్జన్యాలు, దొంగ ఓట్లు కూడా వైకాపా పార్టీ అభ్యర్థుల ఓటమిని ఆపలేక పోవడం గమనార్హం అన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రులు వైకాపా పార్టీని పూర్తిగా తిరస్కరించారన్నారు. ఇప్పటికైనా రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలించే నిర్ణయాన్ని వైకాపా విరమించుకోవాలని సూచించారు. వైకాపా మునిగిపోయే పడవ, వైకాపా నాయకులు, కార్యకర్తలను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని, స్వగృహ ప్రవేశం చేయమని తులసిరెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే రాజశేఖర్ రెడ్డి ఆశయమని, ఆ ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ లోకి తిరిగి రమ్మని వైకాపా శ్రేణులకు తులసిరెడ్డి పిలుపునిచ్చారు.