ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, మరో వ్యక్తి రోహిత్ గార్గ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సల్మాన్ ఖాన్ సన్నిహితుడికి రోహిత్ గార్గ్ పేరుతో బెదిరింపుతో కూడిన ఈ మెయిల్ వచ్చింది. హిందీలో ఇది రాసి ఉంది.
‘‘లారెన్స్ బిష్ణోయ్ ఇటీవలే ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూని సల్మాన్ ఖాన్ తప్పకుండా చూడాలి. లేదంటే చూసేలా చేయాల్సి వస్తుంది. ఖాన్ ఒకవేళ ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని అనుకుంటే, గోల్డీ భాయ్ తో ముఖాముఖి మాట్లాడాలి’’ అన్నది ఈ మెయిల్ సారాంశం. తన జీవిత లక్ష్యం సల్మాన్ ఖాన్ ను అంతం చేయడమేనని ఇంటర్వ్యూలో లారెన్స్ బిష్ణోయ్ చెప్పడం గమనించొచ్చు.
సల్మాన్ ఖాన్ కు తాజా బెదిరింపుల నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భద్రతను ముంబై పోలీసులు కట్టుదిట్టం చేశారు. సల్మాన్ ఖాన్ సన్నిహిత మిత్రుడు ప్రమోద్ గుంజాల్కర్ బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 506(2), 120(బీ), 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సల్మాన్ ఖాన్ కు, ఆయన తండ్రికి గతంలోనూ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు.