తొమ్మిదిరోజులపాటు జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తీరు చాలా అప్రజాస్వామికంగా ఉందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గౌరవ గవర్నర్ గారి స్పీచ్ జరిగిన రోజు కూడా ఆపార్టీ సభ్యులు మధ్యలో బాయ్‌కాట్ చేసి అరుస్తూ, పేపర్లు చించి వెళ్లిపోయారు. ఆ తర్వాత గవర్నర్ గారికే ముఖ్యమంత్రి గారు సరైన గౌరవం ఇవ్వలేదంటూ ఒక విషప్రచారాన్ని ఎల్లో పత్రికల్లో రాయించి జగన్‌మోహన్‌రెడ్డి గారి మీద బురదజల్లే ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్ర ప్రజలంతా వీటన్నింటినీ గమనించాలి. శాసన సభ సమావేశాలు జరిగినన్ని రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా తెలుగుదేశం పార్టీ వారు సస్పెండ్ కాకుండా లేరు. ప్రతీరోజు సభకు రావడం, సభను ఆటంకపరచడం, సస్పెండై వెళ్లడం అనేది ఆపార్టీ ప్రధాన ఉద్దేశంగా పెట్టుకుంది. దాన్ని ఈ తొమ్మిదిరోజులపాటు నిత్యకృత్యంగా వారు అమలు చేశారు. మరీ, చిత్రమైన విషయమేంటంటే.. కొన్ని రోజులు కొన్ని సందర్భాల్లో వారిని సస్పెండ్ చేయడం ఆలస్యమైతే వారు భరించలేకపోయారు. ఆ భరించలేనితనంతో స్పీకర్ పోడియం ఎక్కారు. పోడియం వెల్‌లోకి వెళ్లారు. గౌరవ స్పీకర్ గారి పక్కన చేరి అల్లరి అల్లరి చేశారు. ఆయన మీద కాగితాలు చింపి వేస్తూ .. ఒకదశలో భౌతికదాడికి పాల్పడే ప్రయత్నానికి ఒడిగట్టి అప్రజాస్వామిక విధానంతో టీడీపీ వారు వ్యవహరించారు. చంద్రబాబు సూచనమేరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎంత గందరగోళం సృష్టించారనేది ఆంధ్రరాష్ట్ర ప్రజలంతా చూశారు అని మంత్రి ఆగ్రహం వ్యక్తపరిచారు.