నాలుగేళ్లగా చెప్పినవన్నీ నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ 2023–24 ఏం చెబుతుందంటే.. ప్రభుత్వం తరపున మనం ఏదైతే ప్రజలకు మాటిచ్చామో.. ఏ మేనిఫెస్టో అయితే రిలీజ్ చేసి దాన్ని ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి చెప్పామో అలా చెప్పిన ప్రతీహామీని గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి బడ్జెట్‌లోనూ దానికి డబ్బులు కేటాయిస్తూ.. ప్రతి అడుగులోనూ ఆ పనులు పూర్తి చేస్తూ వచ్చాం. ఈ రాష్ట్ర బడ్జెట్ 2023–24 కు సంబంధించి మన ఫిలాసపీని కొనసాగిస్తూ.. మనం చెప్పిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తూ అడుగులు ముందుకువేస్తున్నాం. ఈ ఒక్క బడ్జెట్‌లో మాత్రమే కాకుండా ఇంతకముందు ప్రవేశపెట్టిన నాలుగు బడ్జెట్‌లలో కూడా ఇదే మానవత్వం కనిపిస్తోంది అని అన్నారు.