అమరావతిలో చంద్రబాబు కట్టింది గోరంత.. కొట్టేసింది కొండంత అని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న సంక్షోభాన్ని చంద్రబాబు తన అవినీతికి ఒక అవకాశంగా మార్చుకున్నారని, విచ్చలవిడిగా ప్రజాధనం లూటీ చేశారన్నారు. ఈ కేడీని ఏ ఈడీ పట్టుకోలేదన్న ధీమాతోనే చంద్రబాబు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనం లూటీ చేశారు. ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకుతిన్నారు. ఏపీ సచివాలయ నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది. ఆ అవినీతిపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాల నుంచి టీడీపీ పార్టీ ఫండ్స్ కోసం డబ్బులు డిమాండ్ చేశారు. చంద్రబాబు చేసిన దొపిడీ ప్రజలకు తెలియాలి. బోగస్ ఇన్వాయిస్లతో నిధులు మళ్లించారు. ఆర్వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్ సంస్థలకు నిధులు మళ్లించారు. చివరగా ఆ డబ్బులన్నీ చంద్రబాబుకు చేరాయి. చంద్రబాబు, టీడీపీకి రూ.143 కోట్లు అందాయని తెలిపారు.